Neeraj Chopra Diamond League: పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజతంతో సత్తా చాటాడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించాడు. యావత్ దేశం నీరజ్ చోప్రా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అయితే చోప్రా ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి బ్రేక్ తీసుకోలేదు. అతను నేరుగా ట్రైనింగ్‌లో దిగాడు. తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత, అనేక వేడుకలు, కమిట్‌మెంట్స్ కారణంగా చోప్రా చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది. ఈసారి అతను అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌లో శిక్షణ పొందడానికి స్విస్ పట్టణంలోని మాగ్లింగెన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్‌ను ముగించే ముందు మరికొన్ని డైమండ్ లీగ్ పోటీల్లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పటి వరకు వేడుకలు ఆగాల్సిందే.
ఈ అంశాలపై శనివారం మీడియా సమావేశంలో చోప్రా విలేకరులతో మాట్లాడాడు. 'నేను ముందుగా సెప్టెంబర్ 5న జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో, సెప్టెంబరు 14న బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌లో పాల్గొనాలని అనుకున్నాను. ఇప్పుడు ఆగస్టు 22న జరిగే లుసానె డైమండ్ లీగ్‌లో కూడా పోటీ చేస్తాను. మరో నెల మాత్రమే ఉంది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటాను' అని చెప్పాడు.
పోటీల తర్వాతే చికిత్స
గజ్జ గాయంతో బాధపడుతున్నప్పటికీ చోప్రా తన సీజన్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. 'టోక్యో తర్వాత నేను ఇతర అథ్లెట్ల మాదిరిగానే నా సీజన్‌ను కొనసాగించాలని భావించాను. అదృష్టవశాత్తూ పారిస్‌లో నా గజ్జ గాయం మరింత తీవ్రం కాలేదు. కాబట్టి నేను నా సీజన్‌ను కొనసాగించగలను. నా గజ్జను సురక్షితంగా ఉంచుకుని సీజన్‌ను పూర్తి చేస్తాను. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాయానికి చికిత్స తీసుకోవడం గురించి ఆలోచిస్తాను' అని తెలిపాడు.
ఒలింపిక్స్‌లో గాయం ప్రభావం
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌పై నీరజ్ స్పందించాడు. 'అర్షద్ తన రెండో త్రోతో 92.97 మీటర్లు విసిరినప్పుడు. నేను దాన్ని అధిగమించగలననే అనుకున్నాను. నేను అప్పటి వరకు 90 మీటర్ల కంటే ఎక్కువ వేయలేదని నాకు తెలుసు. కానీ మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్క సరైన త్రో సరిపోతుంది. నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. కానీ ఫిజికల్‌గా చేయలేకపోయాను. రన్‌వేపై అవసరమైన లెగ్‌వర్క్ లభించలేదు. పోటీకి ముందు గాయానికి సంబంధించిన భయం నా మనసులో ఉంది. నొప్పి ఎప్పుడు వస్తుందో తెలియదు. జావెలిన్ విసరడానికి ముందు వేసిన క్రాస్ స్టెప్‌ల గజ్జలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి' అని తెలిపాడు.
90 మీటర్లే లక్ష్యం
JSW స్పోర్ట్స్ నిర్వహించిన అతని ప్రెస్ బ్రీఫింగ్ ముగియడంతో చోప్రా 90 మీటర్ల మార్కు సహా అతని భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగారు. నీరజ్ స్పందిస్తూ, 'వచ్చే నెలలో జావెలిన్‌ను రిలీజ్ చేసే లైన్‌పై నేను వర్క్ చేయాల్సి ఉంది. పారిస్‌లో నా చేయి వేగం బాగానే ఉంది. లైన్ సరిగ్గా ఉంటే, నేను మరికొన్ని మీటర్లు విసిరి ఉండవచ్చు. నేను 90 మీటర్లు పారిస్‌లో అందుకుంటానని అనుకున్నాను. కానీ కుదర్లేదు. ఈ టార్గెట్ బిజినెస్‌ని దేవుడికి వదిలేస్తున్నాను. కష్టపడి పని చేస్తే మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటే అక్కడికి చేరుతాం' అని చెప్పాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే? - Neeraj Chopra Brand Value
పారిస్ ఒలింపిక్స్ మెడల్ విన్నర్స్‌పై కాసుల వర్షం - ఎవరెవరికి ఎంతిచ్చారంటే? - Paris Olympics 2024