Neeraj Chopra Lausanne Diamond League : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి రెండో స్థానంతో మెరిశాడు. తాజాగా జరిగిన లుసానె డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. 89.49 మీటర్లు ఈటెను విసిరిన నీరజ్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయితే ఎప్పటి లాగే ఈ సారి కూడా అతడి 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లు ఈటెను విసిరి ఈ లుసానె డైమండ్ లీగ్‌లో అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. జర్మన్ అథ్లెట్ వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఏ రౌండ్‌లో ఎంత దూరమంటే?- మొదటి రౌండ్‌లో 82.10 మీటర్లు ఈటెను విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు నీరజ్ చోప్రా. ఆ తర్వాత వరుసగా 83.21 మీటర్లు, 83.13 మీటర్లు, 82.34 మీటర్లు, 85.58 మీటర్ల ప్రదర్శన కనబరిచాడు. ఇక ఫైనల్ రౌండ్‌లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ జావెలిన్‌ను 90.61 మీటర్లు విసరగా, నీరజ్ చోప్రా తన శక్తినంతా ఉపయోగించి 89.49 మీటర్లు ఈటెను విసిరాడు. ఇది నీరజ్ కెరీర్‌లో రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ 2022లో 89.94 మీటర్లు(Neeraj Chopra Best Javelin Throw) ఈటెను విసిరాడు. ఇప్పటి వరకు అతడి కెరీర్‌లో ఈ స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ ప్రదర్శనే అత్యుత్తమం.
రీసెంట్గా పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగాడు నీరజ్ చోప్రా. దీంతో అతడు పసిడిని ముద్దాడతాడని అంతా భావించారు. కానీ అతడు 89.45 మీటర్లు ఈటెను విసిరి సిల్వర్ మెడల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇదీ కూడా అత్యుత్తమ ప్రదర్శనే.
ఇక 2022లో 87.66 మీటర్లు ఈటెను విసిరి డైమండ్ లీగ్ విజేతగా నిలిచాడు నీరజ్ చోప్రా. అనంతరం 2023 డైమండ్ లీగ్‌లోనూ 89.08 మీటర్లు విసిరి ఎప్పటికీ గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే? - Neeraj Chopra Brand Value
బంగారుకొండకు వెండి దండ - నీరజ్ చోప్రా సెన్సేషనల్ రికార్డ్ - PARIS OLYMPICS 2024