Mohammed Shami Comeback: టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆడతాడనుకున్న షమీ మరింత ఆలస్యంగా మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ అతడికి ఆస్ట్రేలియా పర్యటన దాకా విశ్రాంతినిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. షమీని నేరుగా ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. చీలమండ గాయం కారణంగా దాదాపు 10 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీని జాగ్రత్తగా వినియోగించుకోవాలని భావిస్తోంది.
షమీతో రికవరీ
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో షమీ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో షమీ రీఎంట్రీ ఇస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, షమీని నేరుగా ఆస్ట్రేలియా పర్యటనలోనే బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తోంది. షమీ తుది జట్టులోకి వస్తే టీమ్ ఇండియాకు బలం చేకూరుతుంది. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షమీ ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయగలడని భావిస్తోంది.
'షమీ క్రికెట్‌కు దూరమై చాలా కాలం గడిచింది. అతను ఆటతో సజావుగా కలిసిపోవాలి. బుమ్రా రీఎంట్రీ విషయంలో ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడించాం. బుమ్రా పనిభారాన్ని క్రమంగా పెంచడానికి అది మాకు వీలుపడింది. కానీ షమీ విషయంలో అలా కాదు. ఇది టెస్టు క్రికెట్. అక్కడ సుదీర్ఘ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. దీంతో దశల వారీగా షమీతో పనిచేయాలి. ఆస్ట్రేలియా పర్యటననే అంతిమ లక్ష్యం' అని బీసీసీఐ అధికారి చెప్పారు
ఆస్ట్రేలియా టెస్టులకు షమీ రెఢీ!
తాజా సమాచారంతో సెప్టెంబరులో బంగ్లాతో జరిగే సిరీస్‌కు షమీ అందుబాటులో ఉండడని అర్థం అవుతోంది. అయితే అక్టోబర్‌లో మొదలయ్యే రంజీ ట్రోఫీ బరిలో ఉంటాడని సమాచారం. ఒకవేళ రంజీ ఆడితే న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. అప్పటికీ ఫిట్ నెస్ సెట్ కాకపోతే అక్టోబర్ 31- నవంబర్ 7 మెల్‌బోర్న్‌లో జరిగే ఇండియా- ఏ (India A) మ్యాచ్‌ల్లో షమిని బరిలోకి దించేలా బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. అలాగే బుమ్రాకు సైతం విశ్రాంతి ఇచ్చి ఆస్ట్రేలియాతో సిరీస్ లో బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. బంగ్లా సిరీస్‌కు అర్షదీప్ సింగ్ లేదా ఖలీల్ అహ్మద్‌ను బుమ్రా స్థానంలో తీసుకురావాలని యోచిస్తున్నారు.
కాగా, ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సియట్ (CEAT) క్రికెట్ రేటింగ్స్ అవార్డ్స్ 2024 వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహ్మద్ షమీ అందుకున్నాడు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి బుధవారం మహ్మద్ షమీ హాజరయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డును రోహిత్ శర్మ, వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును విరాట్ కోహ్లీ అందుకున్నాడు.
కోహ్లీ, రోహిత్‌ను అలా చేయాలని కోరడం కరెక్ట్ కాదు! : జై షా - Rinku Singh Domestic Cricket