Mitchell Starc IPL 2024: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2024 ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచే సంచలనంగా మారాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.24.75 కోట్లకు అమ్ముడైన స్టార్క్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతడిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ, స్టార్క్ ఈ సీజన్ లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఏకంగా 11+ ఏకనమీతో పరుగులు సమర్పించుకున్నాడు. తీనిన వికెట్లు (12) కూడా తక్కువే. ఈ నేపథ్యంలో స్టార్క్‌కు జట్టులో స్థానం కూడా దండగే! అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, క్వాలిఫయర్- 1లో సన్‌రైజర్స్‌పై సత్తా చాటాడు. ఒక్క మ్యాచ్‌తో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు.
ఒక్క మ్యాచ్‌తో వర్త్: అహ్మదాబాద్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు షాక్ ఇచ్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ (0)ను సూపర్ యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత నితీశ్ రెడ్డి (9), షహబాజ్ అహ్మద్ (0)ను కూడా పెవిలియన్ చేర్చి పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్‌ను గట్టిదెబ్బ కొట్టాడు. దీంతో సన్‌రైజర్స్ డిఫెన్స్‌లో పడింది. ఫలితంగా క్రమంగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఇక స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించి ఫైనల్‌కు దూకుకెళ్లింది. ఇలా అసలైన మ్యాచ్‌లో సత్తా చాటిన స్టార్క్ రూ.25 కోట్లకు వర్త్ అనిపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.
నాకౌట్స్‌లో తగ్గేదేలే: టోర్నీ ఏదైనా, లీగ్ దశలో పెద్దగా ప్రభావం చూపించని స్టార్క్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం అదరగొట్టేస్తాడు. తాజాగా క్వాలిఫయర్- 1లో సన్‌రైజర్స్‌పై ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది భారత్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లోనూ స్టార్క్ తన మార్క్ చూపించాడు.
మెగాటోర్నీ లీగ్ దశలో పెద్దగా రాణించని స్టార్క్, ఫైనల్లో రెచ్చిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇందులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4), కేఎల్ రాహుల్ (66 పరుగులు) రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో స్టార్క్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడపోయినా, 'నాకౌట్స్ అంటే రెచ్చిపోతాడు', 'అసలైన టైమ్‌లో ఆదుకుంటాడు' అంటూ నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.