Keshav Maharaj Ayodhya: సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ అయోధ్య రామ మందిరాన్ని గురువారం సందర్శించాడు. తాను బాల రాముణ్ని దర్శించుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. ఈ మేరకు మందిరంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే 2024 ఐపీఎల్లో పాల్గొనేందుకు కేశవ్ రీసెంట్గా భారత్‌కు వచ్చాడు. అతడు ఈ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్‌కప్ సమయంలో భారత్‌కు వచ్చిన కేశవ్ కేరళలోని పలు ఆలయాలు సందర్శించాడు.
అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక జనవరి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కూడా కేశవ్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈసారి భారత్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానన్న కేశవ్ తాజాగా దర్శించుకున్నాడు.
గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్‌ల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. గతేడాది జరిగిన సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని అప్పట్లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్‌తో చెప్పగా, కేశవ్ నవ్వుతూ అవునని బదులిచ్చాడు.
Lucknow Super Giants Team Visit Ayodhya: కేశవ్‌తోపాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్, లఖ్‌నవూ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఇతర సిబ్బంది కూడా బాలక్ రామ్‌ను దర్శించుకున్నారు. ఈ ఫొటోను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'లఖ్‌నవూ నుంచి అయోధ్య వరకు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీరి దర్శనం కోసం ఫ్రాంచైజీ యాజమాన్యం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో లఖ్‌నవూ మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
'ఫ్యామిలీతో కేశవ్ అయోధ్య ట్రిప్- అందుకు LSG ఏర్పాట్లు?'
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్