Jyothi Yarraji Asian Indoor Athletics Championships 2024 : భారత స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి తాజాగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మహిళల 60మీ హర్డిల్స్‌లో తన పేరిటే ఉన్న ఓ జాతీయ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో శనివారం ఆమె 8.12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. హీట్‌లో 8.22 సెకన్ల టైమింగ్‌తో టాప్ పొజిషన్‌కు చేరుకున్న జ్యోతి ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన తెరెదా (8.21సె)ను బీట్ చేసి విజేతగా నిలిచింది. ఇక ఇదే టోర్నీలో హాంకాంగ్‌కు చెందిన లుయ్ లై యు 8.26 సెకన్లతో కాంస్యం సాధించింది.
ఇక 60మీ హర్డిల్స్‌లో జ్యోతి గత అత్యుత్తమ టైమింగ్ 8.13 సెకన్లు. 2022 ఆసియా క్రీడల్లో ఆమె 100మీ హర్డిల్స్ రజత పతకాన్ని సాధించింది. ఆసియా ఔట్ డోర్ 100మీ హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. భువనేశ్వర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్‌లో జ్యోతి ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది.
మరోవైపు ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్‌లో ఇంకో రెండు స్వర్ణాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ పసిడి పతకాన్ని సాధించాడు. తన రెండో ప్రయత్నంలోనే ఈ స్టార్ తన గుండును 19.71 మీటర్లు విసిరి టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. ఇక మహిళల 1500మీ పరుగులో హర్మిలాన్ బెయిన్స్ బంగారు పతకాన్ని సాధించింది. రేస్‌ను 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Jyothi Yarraji Medals : గతేడాది జూలై 12న బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 23 ఏళ్ల జ్యోతి యర్రాజీ సత్తా చాటింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో గెలుపొంది భారత్‌కు స్వర్ణాన్ని అందించింది. కేవలం 13.09 సెకన్లలో ఈ ఫీట్‌ను అందుకుంది. దీంతో పాటు ఆసియా క్రీడల్లోనూ 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.91సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని జ్యోతి రజత పతకాన్ని అందుకుంది.
Jyothi Yarraji Asian Games 2023 : హై డ్రామా.. ఎట్టకేలకు సిల్వర్ మెడల్‌తో మెరిసిన తెలుగు తేజం
భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు.. సత్తా చాటిన ఆంధ్రా పరుగుల రాణి జ్యోతి!