IPL Mega Auction Controversy : ఐపీఎల్ పాలక మండలి, అలాగే పది ఫ్రాంచైజీల మధ్య జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసినట్లు తెలుస్తోంది. ముంబయి వేదికగా బుధవారం రాత్రి వరకూ ఈ భేటీ కొనసాగగా, మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్, ఇంపాక్ట్ రూల్‌పైనే ఇందులో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశాన్ని ముగించింది.
ఇదిలా ఉండగా, ఈ విషయంపై మరోసారి భేటీకి అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ మెగా వేలం నిర్వహణకు ఫ్రాంచైజీలు ఏ మాత్రం ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు ఐపీఎల్ వర్గాల మాట. ఇక ఈ విషయంపై సన్‌రైజర్స్ హైదరబాద్ షారుక్‌కు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.
నెస్ వాడియాతో షారుక్ వాగ్వాదం
ఈ సమావేశంలో పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా, అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ మెగా వేలం నిర్వహణతో పాటు రిటెన్షన్‌లో ఎంతమందిని అట్టిపెట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. షారుక్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవాలని కోరుతుండగా, నెస్ వాడియా మాత్రం అదేం అవసరం లేదని వాదించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మెగా వేలాన్ని నిర్వహించాలంటూ నెస్ కోరినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ సమావేశంలో దిల్లీ నుంచి కిరణ్ కుమార్ గ్రంథి, లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రూపా గురునాథ్, సన్‌రైజర్స్ నుంచి కావ్యా మారన్, రాజస్థాన్ ప్రతినిధిగా మనోజ్ బదాలే హాజరయ్యారు. కనీసం 8 మందిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని, విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకొనే అవకాశం ఇవ్వాలని సన్‌రైజర్స్ జట్టు కోరినట్లు తెలుస్తోంది.
కాగా, ఇదే సమావేశంలో దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమతమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో తీవ్ర చర్చకు దారి తీసిన 'ఇంపాక్ట్ రూల్'ను తొలగించాలని దిల్లీ ఫ్రాంచైజీ చెప్పిందట. ఇక కనీసం ఏడుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి సూచించిందట.
బీసీసీఐదే ఫైనల్ డెసిషన్
అయితే వేలం నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తే, రిటెన్షన్ అవసరమే ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాల మాట. ఈ మెగా వేలం నిలుపుదలపై షారుక్, నెస్ వాడియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. షారుక్ ఈ విషయానికి అనుకూలంగా ఉండగా, నెస్ మాత్రం నిర్వహించాలని కోరారు. రిటైన్ చేసుకొనే అంశంపైనా పది ఫ్రాంచైజీల్లోని ఎక్కువ మంది కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొత్త వారికి అవకాశం దక్కుతుందని మరికొన్ని ఫ్రాంచైజీలు వాదించినట్లు సమాచారం.
రూ.120కోట్ల పర్స్ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction