IPL 2024 Sunrisers VS CSK : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. ఆశించిన మేర ప్రదర్శన కనబరచకపోవడంతో చెన్నై జట్టుకు నిరాశ తప్పలేదు. పవర్ ప్లేలో 48/1, చివరి 5 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిందంటేనే ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనను అంచనా వేయొచ్చు. సన్‌రైజర్స్ నుంచి ఏడుగురు బౌలర్లు సంధించిన అస్త్రాలకు చెన్నై బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఇక చెన్నై ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ అంటే శివమ్ దూబె (45; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మాత్రమే. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చాకచక్యంగా ఎదుర్కొంటూ 6.3 ఓవర్లలోనే మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు మొత్తం కుదేలవుతున్నా తానొక్కడే నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దూబె హీరోయిక్ ప్రదర్శనపై సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ పెడుతూ దూబెను తెగ పొగిడేశాడు. "ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో స్పిన్‌ను ఎదుర్కోగల శివందూబె లాంటి బ్యాట్స్‌మన్ అవసరం. టీమిండియా సెలక్టర్లు రాబోయే వరల్డ్ కప్ జట్టులో దూబెను తీసుకునేందుకు పరిశీలన జరపాలి" అంటూ పోస్టు పెట్టాడు.
గతేడాది అప్ఘానిస్థాన్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు దూబె. ఆగష్టు 2023వరకూ దూబె ఆడింది 9 టీ20లు అయితే అందులో మూడు మ్యాచ్‌లలో దూబెకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో 16 మ్యాచ్ లు ఆడి 418 పరుగులు సాధించాడు.
ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాట్ కమిన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో నిర్ణీత ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగారు. వైజాగ్ గేమ్‌ను దృష్టిలో ఉంచుకొని ధోనీ ప్రదర్శనపై అంచనాలు పెంచుకున్న అభిమానులకు మహీ చివర్లో దిగి 2 బంతులకు ఒక పరుగు మాత్రమే చేసి నిరాశను మిగిల్చాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 బంతులు మిగిలి ఉండగానే 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కోల్‌కతా, గుజరాత్ చేతిలో ఓడి ముంబయి, చెన్నైలపై గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.
ఉప్పల్‌లో సన్‌రైజర్స్ విక్టరీ- 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం - SRH vs CSK IPL 2024