IPL 2024 Rishab pant : సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడితే కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. అలాంటిది మోకాలికి తీవ్ర గాయమై, దాని నుంచి త్వరగా కోలుకుని ఆడాలంటే అద్భుతమనే చెప్పాలి. కానీ రిషబ్ పంత్ విషయంలో మాత్రం ఆ అద్భుతమే జరిగింది. పంత్ వైద్యులతో సవాలు చేసి మరీ ఈ అద్భుతాన్ని చేసి చూపించాడు. వైద్యులు చెప్పిన దాని కన్నా కనీసం ముడు నెలల ముందే కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని స్వయంగా రిషభ్ పంత్‌కు చికిత్స చేసిన కోకిలాబెన్ హాస్పిటల్ డాక్టర్ దిన్షా పార్దీవాలా చెప్పారు.
"డాక్టర్లుగా మేం పేషంట్ పరిస్థితని కచ్చితంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాలి. దీంతో పంత్ పరిస్థితి తెలుసుకున్న అతడి తల్లి తీవ్ర ఆందోళన చెందింది. మళ్లీ అతడు ఎప్పటికైనా నడవగలడా లేదా అని బాధపడింది. అయితే నేను ఆమెకు ధైర్యం చెప్పాను. సాధారణ వ్యక్తిలా పంత్ తిరిగి నడిచేట్లు చేస్తామని హామీ ఇచ్చాం. అతడు తిరిగి క్రికెట్ ఆడేలా మేం ప్రయత్నిస్తామని చెప్పాము. తొలి దశలో ఆపరేషన్‌ను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేశాం. ఆ తర్వాత అతడి రీహాబ్ చాలా స్లోగా సాగింది. ఎందుకంటే ఆ సమయంలో గాయం తగ్గే ప్రక్రియను డిస్టర్బ్ చేయకూడదు. ఆ తర్వాత గాయపడిన భాగాన్ని బలోపేతం చేశాం. కదలికలు సాఫీగా, చురుగ్గా సాగేలా చూశాం. ఎందుకంటే గేమ్స్ ఆడేవాళ్లకు ఇది చాలా కీలకం. అప్పుడు సాధారణ స్థితికి చేరేందుకు కనీసం 18 నెలలు పడుతుందని పంత్‌కు చెప్పాం. కానీ అతడు మాత్రం 12 నెలల్లోనే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని చెప్పాడు" అని డాక్టర్ చెప్పారు.
"మోకాలి చిప్ప పక్కకు జరగడమనేదీ చాలా పెద్ద గాయం. వాటిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ప్రతీ సర్జన్‌కూ సవాల్ లాంటిది. ఆ సమయంలో పేషెంట్‌కు మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే అప్పటివరకు ఓ సూపర్ స్టార్‌లా ఉండి, అనంతరం ఓ సాధారణమైన వ్యక్తి చేసే పని కూడా చేయలేకపోవడం అంటే చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం. అందుకే ఆ సమయంలో అతడికి సపోర్ట్‌గా ఉన్నాం. బాగా ప్రోత్సహించాము. ధైర్యం చెప్పాం" అని డాక్టర్ పేర్కొన్నారు.
కాగా, 14 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న పంత్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌తో పునరాగమనం చేయనున్నాడు. అతడు వికెట్ కీపింగ్ కూడా చేయగలిగే ఫిట్‌నెస్ సంపాదించాడని బీసీసీఐ కూడా ప్రకటించింది. చూడాలి మరి రిషభ్ ఎలా ఆడతాడో.