IND VS NZ 1st Test Sarfaraz Khan Century : బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. నాలుగో రోజు కొనసాగుతోన్న ఆటలో చెలరేగి ఆడిన సర్ఫరాజ్ కెరీర్‌లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్‌ను టచ్ చేశాడు. నాలుగో టెస్టులోనే శతకం పూర్తి చేయడం విశేషం. ఓవరాల్‌గా కూడా ఇది అతడి కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో ఈ శతకాన్ని పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్పరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
కాగా, ఓవర్‌నైట్ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఏ దశలోనూ తడబాటుకు గురికాకుండా ఆడుతున్నాడు. అదిరే షాట్లతో అలరించాడు. ఆఫ్ సైడ్ లేట్ కట్టర్లతో బౌండరీలు బాదాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇకపోతే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేయగా, భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే 356 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి సర్ఫరాజ్ ఖాన్ దూకుడు ప్రదర్శిస్తూ ఆడాడు. కివీస్ పేస్, స్పిన్‌ను దీటుగా ఎదుర్కొంటూనే శతకం బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆడటం తీవ్ర ఒత్తిడితో కూడుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండానే సర్ఫరాజ్ పరుగులు సాధించడం విశేషం.
పంత్ కూడా - రెండో రోజు వికెట్ కీపింగ్ చేస్తుండగా మోకాలిపై నేరుగా బాల్ తగలడం వల్ల నొప్పితో మైదానం వీడాడు రిషభ్ పంత్. మూడో రోజు కూడా నొప్పితో కీపింగ్ చేయలేదు. దీంతో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ మూడో రోజు మ్యాచ్ ముగియగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించిన అతడు నాలుగో రోజు సర్ఫరాజ్‌తో కలిసి క్రీజ్‌లోకి దిగి మంచి ప్రదర్శన చేశాడు.
భారత్, పాక్ మ్యాచ్‌కు అంతా రెడీ - హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే - మ్యాచ్ ఎందులో చూడాలంటే?