ICC Test Rankings : ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ జట్టుకు మరోసారి షాక్ తగిలింది. తాజాగా ఐసీసీ విడుదల టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ ఆ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఏకంగా 8వ పొజిషన్‌కు దిగజారింది. అయితే 1965 తర్వాత ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ ఇప్పుడు ఈరకంగా కిందకు పడిపోవడం గమనార్హం.
"ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ రెండు స్థానాలను కోల్పోయి 8వ పొజిషన్‌కు పడిపోయింది. స్వదేశంలో సిరీస్ ఓటమి కారణంగా పాక్‌కు పాయింట్లు తగ్గిపోయాయి. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాక్ ఆరో స్థానంలో ఉండేది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమి వల్ల కిందికి దిగజారింది" అంటూ ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే ప్రస్తుతం 76 పాయింట్లతో పాకిస్థాన్ 8వ ర్యాంకులో ఉండగా, ఆస్ట్రేలియా (124 పాయింట్లు), భారత్ (120), ఇంగ్లాండ్ (108) టాప్-4లో ఉన్నాయి.
నాలుగో స్థానానికి బంగ్లా
లార్డ్స్ వేదికగా 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడేందుకు బరిలోకి దిగుతాయి. అలా చూస్తే ఇప్పుడు ఈ లిస్ట్‌లో భారత్ (68.52 శాతం), ఆస్ట్రేలియా (62.50 శాతం)తో తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక న్యూజిలాండ్ (50) మూడో స్థానానికి పరిమితమవ్వగా, బంగ్లాదేశ్ జట్టు ఏకంగా (45.83) నాలుగో స్థానానికి చేరుకుంది.
ఇక ఇంగ్లాండ్ (45) ఐదో పొజిషన్‌కు చేరుకోగా, పాకిస్థాన్ (19.05) ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అయితే వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ నాటికల్లా ఏ రెండు జట్లు ఈ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంటాయో అవే టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం బరిలోకి దిగుతాయి.
ఇక ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ తాజాగా పసికూన బంగ్లాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో పాకిస్థాన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ మాత్రం దానికి 'ఆర్మీ ట్రైనింగ్ వృధా', 'ఆర్మీ ట్రైనింగ్ తర్వాత ఏకంగా బంగ్లా చేతిలో వైట్‌వాష్ అయ్యింది' అంటూ మీమ్స్ వస్తున్నాయి.
మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ- టీమ్ఇండియాకు ఈ 5 అంశాలు కీలకం! - Champions Trophy 2025
ICC ర్యాంకింగ్ సిస్టమ్- ఎలా లెక్కిస్తారో తెలుసా? - ICC Rankings System