ICC Test Rankings Bumrah: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకు సాధించిన తొలి భారతీయ పేస్ బౌలర్‌గా రికార్డు కొట్టాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా టెస్టు బౌలింగ్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి టాప్‌లోకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం బుమ్రా 881 రేటింగ్స్‌తో ఆగ్రస్థానంలో ఉండగా సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడా 851 రేటింగ్స్‌తో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నడు. ఇక టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 841 రేటింగ్స్‌తో మూడు, రవీంద్ర జడేజా 746 రేటింగ్స్‌తో తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ (Ind vs Eng Test Series 2024)లో రెండో మ్యాచ్‌లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రెండో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు నేలకూల్చి, ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సూపర్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. అలాగే భారత్ తరఫున వేగంగా 150+ వికెట్లు తీసిన పేసర్‌గానూ నిలిచాడు.
మరోవైపు ఈ సిరీస్‌లో మూడో టెస్టు కోసం ఇరుజట్లు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించేందుకే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 57.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు జట్లలో కలిపి మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయలేదు. రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 14 మెయిడెన్ ఓవర్లు వేశాడు. ఇక 10.66 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా బుమ్రానే. అయితే రెండో టెస్టులో బెంచ్‌కు పరిమితమైన మహ్మద్ సిరాజ్‌ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ షాకింగ్ డెసిషన్- మూడో టెస్టుకు బుమ్రాకు దూరం!- ఎందుకంటే?