International Cricket Ball Making Process : ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ సిటీగా ప్రసిద్ధి చెందింది. అత్యుత్తమ నాణ్యతతో క్రీడా వస్తువులు, క్రికెట్ పరికరాలు తయారు చేయడంలో గుర్తింపు పొందింది. అక్కడ ఈ పరిశ్రమలోని టాప్ కంపెనీల్లో ఒకటి శాన్స్ పేరిల్ గ్రీన్‌ల్యాండ్స్ (SG). ఈ సంస్థ ప్రపంచ స్థాయి మూడు రకాల క్రికెట్ బాల్స్‌ను కూడా తయారు చేస్తుంది. భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎక్కువగా ఎస్జీ బాల్స్‌నే వినియోగిస్తారు. ఇప్పుడు ఈ SG క్రికెట్ బాల్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
SG మార్కెటింగ్ టీమ్‌కి చెందిన శివం శర్మ, ఇక్కడ తయారయ్యే బంతులు భారతదేశం అంతటా అమ్ముడవుతాయని చెప్పారు. కంపెనీకి దేశవ్యాప్తంగా డీలర్లు ఉన్నారు. ఈ బంతులను అన్ని టెస్ట్ మ్యాచ్‌లలో ఉపయోగిస్తారు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న దేశీయ సీజన్‌లో SG బంతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కూడా ఈ బంతులే వినియోగిస్తారు. క్రికెటర్లు స్వయంగా ఎప్పటికప్పుడు కంపెనీని సందర్శిస్తారు. చాలా మంది ఆటగాళ్ళు ఎస్జీ కంపెనీ ప్రొడక్టులను ఇష్టపడతారు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సంజూ శాంసన్ సహా ప్రముఖ క్రికెటర్లు SG ప్రొడక్టులు ఉపయోగిస్తున్నారని శివమ్ చెప్పారు.
తొలిసారి పింక్ బాల్ తయారీ
కొంతకాలం క్రితం ఈ కంపెనీలో రెండు రకాల బంతులను తయారు చేసేవారని, ఇప్పుడు కంపెనీ మూడు రకాల బంతులను తయారు చేస్తుందని శివమ్ చెప్పారు. SG పింక్ బాల్‌ను మొదటిసారిగా పరిచయం చేసిందని పేర్కొన్నారు. వీటిలో రెడ్, వైట్, పింక్ బంతులు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లలో రెడ్ బాల్ ఉపయోగిస్తారు, టీ20 టోర్నమెంట్లలో వైట్ బాల్ వాడుతారు. ఈ సంస్థ తయారు చేసిన పింక్ బాల్‌ను తాజాగా విడుదల చేశారు. కోల్‌కతాలో జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మొదట పింక్ బాల్ ఉపయోగించారని శివమ్ పేర్కొన్నారు.
ఎస్జీ బాల్స్ ఎలా తయారు చేస్తారు?
SG క్రికెట్ బాల్‌ను తయారు చేసే ప్రక్రియ సుదీర్ఘమైంది. చాలా మంది కళాకారుల చేతి పనితో బాల్ తయారు అవుతుంది. ఒక క్రికెట్ బాల్ పూర్తయ్యే సరికి దాదాపు 12 నుంచి 15 మంది కళాకారుల చేతుల్లోకి వెళ్తుంది. ముడి పదార్థాన్ని కత్తిరించడం, బంతి ఆకృతిని చేయడం లేదా కలిపి కుట్టడం వంటి పనులను వివిధ కళాకారులు చేస్తారు. ఈ దశలన్నింటి తర్వాత, మార్కెట్‌కు పంపే ముందు చివరిగా బంతిని పాలిష్ చేస్తారు.
కంపెనీ ఎలా మొదలైంది?
SG మేనేజింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ మాట్లాడుతూ, తమ తాత 1939 లో క్రికెట్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారని చెప్పారు. ఆ సమయంలో చాలా కష్టపడి స్వయంగా శిక్షణ పొందారని, అనంతరం కుటుంబం జతవ్వడంతో పని ప్రారంభించానని చెప్పారు. తాతగారి తల్లిదండ్రులు మరణించాక, మేనమామ దగ్గర పెరిగారని, తర్వాత 1920లో సియాల్‌కోట్‌లో శిక్షణ తీసుకున్నారని వివరించారు. తాతయ్య, కుటుంబం సభ్యులకు వ్యాపారంలో ఆసక్తి ఉండటం వల్ల కొనసాగించారని తెలిపారు.
వ్యాపారంపై కుటుంబం ఆసక్తి గురించి పరాస్ ఆనంద్ మాట్లాడారు. "దేశ విభజన జరిగినప్పుడు, కుటుంబం సియాల్‌కోట్ నుంచి భారతదేశానికి వచ్చింది. మధ్యలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1950 నుంచి కుటుంబసభ్యుల దృష్టి అంతా క్రికెట్ ఉత్పత్తులపైనే ఉంది. ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడని అందరూ చాలా కష్టపడ్డారు. నేటికీ కుటుంబం పూర్వీకుల సంప్రదాయాన్ని నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకువెళుతోంది. మా దృష్టి ఉత్పత్తిపైనే ఉంది. కస్టమర్ సంతోషంగా ఉండేలా ఉత్పత్తిని తయారు చేయడమే మా లక్ష్యం. దీన్ని ఉపయోగించే ఆటగాళ్లు సంతోషంగా ఉండాలి. ఎస్జీ బాల్ అయినా, మరే ఉత్పత్తి అయినా, మరింత మెరుగ్గా చేయాలనే తపనతో నిరంతరం పని చేస్తున్నాం." అని చెప్పారు.
SG బాల్ ముఖ్యమైన విషయాలు
మేరఠ్‌లోని ఉన్న ఈ SG ఫ్యాక్టరీలో రోజూ సుమారు 1,500 క్రికెట్ బంతులను ఉత్పత్తి అవుతుంటాయి. దీని ప్రారంభ ధర దాదాపు రూ.600 ఉంటుందని సమాచారం. ప్రొఫెషనల్ మ్యాచ్‌లలో ఉపయోగించే హై-ఎండ్ మోడల్ ధర దాదాపు రూ.4,500 వరకు ఉంటుంది. బంతుల సహా తమ క్రికెట్ ఉత్పత్తులకు దేశంలోని ప్రతి మూలలో, క్రికెట్ ఆడే ఇతర దేశాల్లో డిమాండ్ ఉందని కంపెనీ పేర్కొంది.