Hardik Pandya T20I Rankings : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మరో ఘనతను అందుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీ20ల్లో ఆల్‌రౌండర్ల విభాగంలో నెంబర్ వన్‌గా నిలిచిన తొలి భారత క్రికెటర్‌గానూ హార్దిక్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమ్ఇండియా విజయం సాధించడంలో అద్భుత ప్రదర్శనతో కీలకంగా వ్యవహరించిన అనంతరం ఈ మార్క్‌ను అందుకున్నాడు. రెండు స్థానాలు ఎగబాకి లంక ప్లేయర్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం 222 రేటింగ్ పాయింట్లతో వీరిద్దరూ సమంగా ఉన్నారు.
వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ - 2024 లో ఘోరంగా విఫలమైయ్యాడు హార్దిక్ పాండ్య. కెప్టెన్‌గానూ రాణించలేకపోయాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ డివొర్స్ రూమర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి. కానీ మానసికంగా బలంగా తయారై టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరో బౌలర్ కొరత తీర్చడంతో పాటు ప్రతి మ్యాచ్‌లోనూ మంచిగా రాణించాడు. లోయర్ ఆర్డర్‌లో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
మొత్తంగా 6 ఇన్నింగ్స్‌లలో 48 సగటు, 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు సాధించాడు. 11 వికెట్లు పడగొట్టాడు. అలానే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలక సమయంలో హెన్రిచ్ క్లాసెన్ వికెట్‌ను తీశాడు. కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అందుకే తాజా ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు.
లంక ప్లేయర్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ మూడో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అయితే ఈ తాజా ర్యాంకింగ్స్ వల్ల టీ20 ప్రపంచకప్ సమయంలో టాప్‌లో(ర్యాంకింగ్స్‌లో) ఉన్న అఫ్గానిస్థాన్ సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ ఆరో స్థానానికి పడిపోయాడు. ఇక ఆరు స్థానాలు ఎగబాకిన టీమ్ ఇండియా ప్లేయర్ అక్సర్ పటేల్ 12వ ప్లేస్‌లో నిలిచాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియా ఏడు స్థానాలు మెరుగై రెండో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఏడో ర్యాంకులో, కుల్‌దీప్ యాదవ్ ఎనిమిదో ర్యాంకులో నిలిచారు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అలానే వరల్డ్ కప్2024లో 17 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ 13వ ర్యాంకును సంపాదించుకున్నాడు.
BCCI స్పెషల్ అరేంజ్మెంట్స్ - చార్డెట్ ఫ్లైట్‌లో స్వదేశానికి పయనమైన టీమ్ఇండియా