Champions Trophy 2025 Teamindia VS Pakisthan : వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌ను ఎలాగైనా రప్పించాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. రీసెంట్‌గానే పీసీబీ ఛైర్మన్ మోసీన్ నఖ్వీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వస్తే ద్వైపాక్షిక సిరీస్‌లపై దృష్టి సారించొచ్చని అన్నారు. కానీ తాజాగా బీసీసీఐ వర్గాల ప్రకారం అది సాధ్యం కాదని మరోసారి స్పష్టమైంది.
ఈ మెగా టోర్నీ కోసం వేదికను మార్చడం లేదా గత ఆసియాకప్ స్టైల్లోనే హైబ్రిడ్ మోడల్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలానే సమీప భవిష్యత్‌లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం కష్టమేనని పేర్కొన్నారు.
"ద్వైపాక్షిక సిరీస్‌లు మరిచిపోవడమే. కనీసం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా టీమ్ ఇండియా పాకిస్థాన్ గడ్డకు వెళ్లే ఛాన్స్ లేదు. అవసరమైతే వేదిక మారుస్తారు. లేదంటే హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదిస్తారు. టీమ్ఇండియా పాకిస్థాన్ వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కచ్చితంగా కావాల్సిందే. ప్రస్తుతం పాకిస్థాన్‌తో సత్సంబంధాలు సరిగ్గా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఐసీసీ ఈవెంట్. కాబట్టి దీన్ని బీసీసీఐ డీల్ చేయడం కాస్త కష్టమే. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా సమీప భవిష్యత్‌లో ఉండటం కష్టమే. అది అసాధ్యం."అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కాగా చివరిసారిగా 2012-2013లో టీమ్ ఇండియా పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌లో పర్యటించింది. కానీ ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఇతర సమస్యల కారణంగా రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించారు. ఎందుకంటే టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో ఇలా చేశారు.
ఇక ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా - పాకిస్థాన్ జట్లు జూన్ 9న తలపడనున్నారు. న్యూయార్క్ వేదికగా ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ధోనీయే కరెక్ట్' - మరోసారి ట్రెండింగ్‌లోకి DRS - Dhoni Review System