Najmul Shanto On Bangladesh Batting : భారత్‌తో తొలి టీ20లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించడానికి బంగ్లా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ మొత్తంలో కనీసం 30 పరుగుల భాగస్వామ్యం నమోదు కాలేదు. ఫలితంగా బంగ్లా 19.5 ఓవర్లలో 127 పరుగులకు కూప్పకూలింది. అనంతరం అదే పిచ్‌పై భారత్ 11.5 ఓవర్లలోనే ఈ టార్గెట్ ఛేదించి విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో తమ జట్టు బ్యాటింగ్‌పై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.
'ఈరోజు మా ఆట చెత్తగా ఉందని చెప్పడం లేదు. కానీ, మేం ఇంతకన్నా మెరుగ్గా ఆడగలం. అయితే టీ20ల్లో గత కొంతకాలంగా మా ప్రదర్శన బాగాలేదు. ఏ ఒక్క ప్లేయర్ గురించో నేను ప్రత్యేకంగా మాట్లాడను. అగ్రెషన్‌తో కాకుండా ఆలోచనతో బ్యాటింగ్ చేయాలి. ఆ విధంగా మా బ్యాటింగ్‌ను మార్చుకుంటాం. మాకు మంచి స్కోర్ సాధించే సామర్థ్యం ఉంది. అయితే గత 10ఏళ్లుగా మేం ఈ విధంగానే బ్యాటింగ్ చేస్తున్నాం. కొన్నిసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. కొన్నిసార్లు మార్పులు చేయాల్సి ఉంటుంది. మేం స్వదేశీ పిచ్‌ల్లో 140- 150 పరుగులు చేయాడనికే అలవాటు పడ్డాము. అందుకే మ్యాచ్‌లో మంచి పరిస్థితులు ఉన్నప్పటికీ 180 పరుగులు స్కోర్ ఎలా చేయాలో మా బ్యాటర్లకు తెలీదు. నేను పిచ్‌ను నిందించడం లేదు. కానీ మా నైపుణ్యాలు కాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది' అని షాంటో అన్నాడు.
2ఏళ్లలో నాలుగు సార్లే
గత రెండేళ్లలో బంగ్లాదేశ్ 45 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో నాలుగు సార్లు మాత్రమే 180 పరుగుల మార్క్ అందుకుంది. ఐర్లాండ్, శ్రీలంక జట్లపై రెండు రెండు సార్లు నమోదు చేసింది. అది కూడా స్వదేశీ పిచ్‌లపైనే. అందులో శ్రీలంకతో ఆడిన రెండుసార్లు (2022, 2024) కూడా బంగ్లా ఓటమి పాలైంది. ఇక 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనూ బంగ్లా మెరుగైన ప్రదర్శన చేయలేదు. సూపర్ 8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.
టీమ్ఇండియా ఆల్‌రౌండ్ షో- బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ - India Vs Bangladesh T20
తొలి ఓవరే 'మెయిడెన్'- డెబ్యూలోనే మయాంక్ అరుదైన రికార్డ్ - Mayank Yadav Debut