Pakisthan New Captain : పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి సిద్ధమైంది. ప్రస్తుత సారథి బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అజామ్ అన్ని ఫార్మాట్ల సారథి బాధ్యతల తప్పుకున్నాడు.
Babar Azam Captaincy : కానీ టీ 20 ప్రపంచ కప్ ముంగిట బాబార్ అజామ్‌కు తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జట్టు పగ్గాలను అందించింది బోర్డు. అయినప్పటికీ అజామ్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచింది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశను కూడా దాటలేదు. అమెరికా చేతిలోనూ ఓటమిపాలై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అనంతరం రీసెంట్గా సొంత గడ్డపై జరిగిన బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ ఓడిపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది.
టీ20, వన్డేలకు కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలని పీసీబీ అనుకుంటోందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా జట్టును పటిష్టంగా చేయాలని ప్రణాళికలు రచిస్తోందట. అందుకే బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోందని సమాచారం. టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్‌ను కూడా సారథి బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించుకుందట. భవిష్యత్‌లో మూడు ఫార్మాట్లకు రిజ్వాన్‌కే జట్టు పగ్గాలను అందించాలని భావిస్తోందట.
జట్టులో గొడవలకు కారణమిదే - వన్డే ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫ్మార్ట్కు బాబర్ అజామ్ స్థానంలో షాహిన్ అఫ్రిదిని సారథిగా నియమించారు. కానీ అతడికి కేవలం న్యూజిలాండ్ సిరీస్ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అనంతరం తిరిగి బాబర్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఆ తర్వాత జట్టులో గొడవలు మొదలయ్యాయి. కెప్టెన్సీ మార్పులతో జట్టులో ఐక్యత దెబ్బతిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఏదేమైనా నవంబర్‌లో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనతో పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడని తెలిసింది. ఈ పర్యటనలో పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
మహ్మద్ రిజ్వాన్ కెరీర్ - మహ్మద్ రిజ్వాన్ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ అతడు తొలి మ్యాచ్‌లో 171 పరుగులు చేశాడు. మొత్తం 32 టెస్ట్ మ్యాచుల్లో 1310 పరుగులు, 74 వన్డేల్లో 2088 పరుగులు, 102 టీ20 మ్యాచుల్లో 3313 పరుగులు చేశాడు.
నీరజ్‌ను అందుకోవడం కష్టమే! - 'గోల్డెన్ బాయ్' సాధించిన రికార్డులివే! - Neeraj Chopra Top Records