Australia vs Scotland T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ఆదివారం స్కాట్లాంట్తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (68 పరుగులు), మార్కస్ స్టాయినిస్ (59 పరుగులు) అదరగొట్టారు. చివర్లో టిమ్ డేవిడ్ (22*) రాణించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2, బ్రాడ్ వీల్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ ఓటమితో స్కాట్లాండ్ సూపర్- 8కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఓవర్లోనే ప్రమాదకర డేవిడ్ వార్నర్ (1)ను కోల్పోయింది. ఆరో ఓవర్లో మిచెల్ మార్ష్ (8) ఔటయ్యాడు. కాసేపటికే మ్యాక్స్‌వెల్ (11) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసీస్ 60కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో హెడ్, స్టాయినిస్ స్కాట్లాండ్ను రఫ్పాడించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఆసీస్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. ఆఖర్లో వీరిద్దరూ ఔటైనా, టిమ్ డేవిడ్ మిగిలిన పని పూర్తి చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ నెగ్గినప్పటికీ స్కాట్లాండ్ అద్భుతంగా పోరాడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ జోన్స్ (2) ఔటైయ్యాడు. ఇక వన్ డౌన్లో వచ్చిన బ్రెండన్ మెక్మెల్లన్ (60 పరుగులు, 34 బంతుల్లో; 2x4, 6x6), మరో ఓపెనర్ మున్సీ (35 పరుగులు) కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఈ క్రమంలోనే మెక్మెల్లన్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మిడిలార్డర్లో బెరింగ్టన్ (42 పరుగులు*) కూడా రాణించాడు. ఓ క్రమంలో స్కాట్లాండ్ 200 పరుగులు చేసేలా కనిపించింది. ఆఖర్లో ఆసీస్ బౌలర్లు కాస్త పట్టు బిగించడం వల్ల స్కాట్లాంట్ 180 వద్దే ఆగిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, ఏగర్, నథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇంగ్లాండ్‌కు లైన్ క్లియర్: స్కాట్లాండ్ ఓటమితో గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియాతోపాటు తాజాగా ఇంగ్లాండ్ సూపర్- 8కు అర్హత సాధించింది. పట్టికలో ఇంగ్లాండ్, స్కాట్లాంట్ రెండు జట్లు 5 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లాండ్ సూపర్- 8 కి దూసుకెళ్లింది. దీంతో స్కాట్లాండ్కు నిరాశ ఎదురైంది.