Alyssa Healy South Africa Test : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సతీమణి అలీసా హీలి కూడా మంచి ప్లేయరన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది ఈమె. అయితే ఇటీవలే తాను ఆడిన మ్యాచ్‌లో జరిగిన ఘటన అచ్చం తన భర్త కెరీర్‌లో ఎదుర్కొన్నట్లుగానే జరిగింది. యాదృచ్చికంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే ?
అప్పుడు మిచెల్- ఇప్పుడు హీలీ
2013లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ 99 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఇది స్టార్క్ కెరీర్‌లో తొమ్మిదవ మ్యాచ్. అయితే యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలీసా కూడా ఇటీవలే తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటైంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది హీలి. ఇలా తొమ్మిదో టెస్ట్‌లో ఈ జంట 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఇది చూసిన అభిమానులు భర్త అడుగుజాడల్లో భార్య నడవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Australia Vs South Africa Test : ఇక మ్యాచ్ విషయానికి వస్తే- సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 251 పరుగులను స్కోర్ చేసింది. ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లిచ్‌ఫీల్డ్ (4), ఎల్లిస్ పెర్రీ (3), తహీళా మెక్‌గ్రాత్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు ఔటై నిరాశపరిచారు. అయితే అలీసా హీలి (99), బెత్ మూనీ (78), సథర్‌ల్యాండ్ (54*) మాత్రం తమ స్కోర్లతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించారు.
Alyssa Healy Career : ఇక హీలి కెరీర్ విషయానికి వస్తే - ఆసీస్ పురుషుల జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన ఈమె బీసీసీఐ నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ 2022లో తన ఆట తీరుతో సత్తా చాటింది. యూపీ వారియర్స్ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన ఈ స్టార్ క్రికెటర్, జట్టు కెప్టెన్‌గానే కాకుండా ఓ ప్లేయర్‌గానూ కీలక ఇన్నింగ్స్ అందిస్తూ జట్టును ముందుండి నడిపించింది. ఈ నేపథ్యంలో రానున్న రెండో సీజన్ కోసం యూపీ ఫ్రాంచైజీ హీలీని రీటైన్ చేసుకుంది.
'ఏకైక టెస్ట్‌లో ఓడినా మనసులు గెలిచేశావ్గా'- హీలీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!