Which Day is Good for Taking and Giving Loan as per Astrology: అప్పు లేకుండా జీవితం సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. మనలో చాలా మంది అప్పులతోనే సహవాసం చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం, తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ సమయాల్లో అప్పు తీసుకోకూడదో.. ఇవ్వకూడదో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. అవేంటో ఆ మాటల్లోనే తెలుసుకుందాం..
"ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు ఉన్న రోజుల్లో అప్పు ఇవ్వడం, తీర్చడం చేయకూడదు. శనివారం, ఆదివారం, మంగళవారం.. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు.. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు కలిసి వస్తే ద్విపుష్కర యోగం అంటారు. అలాగే శనివారం, ఆదివారం, మంగళవారం.. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు.. విశాఖ, పునర్వసు, పూర్వాభాద్ర, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాడ నక్షత్రాలు కలిసి వస్తే త్రిపుష్కర యోగం అంటారు. ఈ వారాలు, నక్షత్రాలు, తిథులు కలిసి వచ్చినప్పుడు అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు."
--మాచిరాజు కిరణ్ కుమార్, జ్యోతిష్య నిపుణులు
ఈరోజులు కూడా: ఎప్పుడైనా సరే మంగళవారం అప్పు తీసుకోకూడదని.. బుధవారం అప్పు ఇవ్వకూడదని కిరణ్ కుమార్ తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయని వివరిస్తున్నారు. అలాగే మంగళవారం అప్పు తీర్చేస్తే మంచిదని.. బుధవారం అప్పు తీసుకుంటే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.
ఈ నక్షత్రాలు: కొన్ని నక్షత్రాలు ఉన్న రోజుల్లో అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా సానుకూల ఫలితాలు కలుగుతాయని తెలుపుతున్నారు. స్వాతి, పునర్వసు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ట, శతభిష, అశ్విణి ఈ నక్షత్రాలు అప్పు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చని తెలుపుతున్నారు.
ఆలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదని కిరణ్ కుమార్ తెలుపుతున్నారు. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి మారే సంక్రమణ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదని చెబుతున్నారు. అష్ట నక్షత్రం, ఆదివారం రోజు అప్పు తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని వివరిస్తున్నారు.
ధనుష్ట పంచకాలలో అప్పు ఇవ్వడం, తీసుకోకూడదని ఆయన తెలుపుతున్నారు. ధనుష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు ఉన్న కాలంలో అప్పులు చేయడం, ఇవ్వకూడదని వివరిస్తున్నారు.
ఎప్పుడు మంచిది: అప్పుగా డబ్బు తీసుకోవడానికి అన్నింటికన్నా భరణి నక్షత్రం గొప్పదని కిరణ్ కుమార్ తెలిపారు. ఆ రోజు అప్పు చేస్తే మనకు అనుకూల ఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనట్లు వివరిస్తున్నారు. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన ప్రకారం విధివిధానాలను పాటించడం వల్ల సకల సుఖాలను సిద్ధింప చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు.