Vastu Tips For Pooja Room : మనం నివసించే గృహం స్వర్గసీమ కావాలంటే వాస్తు శాస్త్రంలో చెప్పిన కొన్ని సూత్రాలను మనం తప్పకుండా పాటించాల్సిందే! మానవ జీవితానికి వాస్తు శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏవో ఒక సమస్యలు, అప్పులు, ఆర్థిక పురోగతి లేకపోవడం, అనారోగ్య బాధలు వీటన్నింటికి వాస్తు దోషాలు కారణం. వాస్తు దోషాలకు పరిహారాలు తెలుసుకొని ఇంటిని వాస్తురీత్యా అమర్చుకుంటే గృహమే స్వర్గసీమ అవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి అలాంటి స్వర్గం కోసం మనం ఏమి చేయాలో చూద్దాం..
పూజా మందిరం హృదయ స్థానం
ఏ ఇంటికైనా పూజా మందిరం హృదయ స్థానం వంటిది. ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. పూజా మందిరంలో మనం చేసే పూజలే మనకు ఆయుష్షును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజా మందిరం ఉండాల్సిందే అంటుంది వాస్తు శాస్త్రం. పూజా మందిరంలో వాళ్లు వీళ్లు ఇచ్చారు కదా అని దొరికిన ఫొటోలన్నీ పెట్టి గందరగోళం చేసేయకూడదు. ఇంట్లో అడ్డాలుంటే మనకెలా ఊపిరాడదో దేవునికి కూడా అంతే! అసలే చిన్న గది అందులో అక్కర్లేనివి అన్నీ పెట్టేస్తే దేవునికి ఎలా ఊపిరాడుతుంది చెప్పండీ!
ఇంటి ఆనవాయితీ ప్రధానం
కొంత మందికి వారి ఇంటి పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుని సింహాసనం ఆనవాయితీ ఉంటుంది. మరికొంతమంది సాధారణంగా పీట మీద దేవుని విగ్రహాలను కానీ, పటాలను కానీ ఉంచుతారు.
ఇలవేల్పు కులదైవం
ప్రతి వారికి వారి ఇంటి ఇలవేల్పు ఉంటారు. ఆ సంప్రదాయం ప్రకారం వారి ఇలవేల్పులను ముందుగా పూజా మందిరంలో సింహాసనం లో కానీ, పీట మీద కానీ అమర్చుకోవాలి. తరువాతే మిగిలిన దేవీదేవతల విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నిత్య దీపారాధనతోనే ఇంటి క్షేమం
పూజామందిరంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసి పూజాదికాలు చేయాలి. ఇది ఇంటికి ఎంతో క్షేమం.
ఎవరు పూజ చేస్తే ఇంటికి శ్రేయస్కరం?
ఇంటికి ప్రధమ స్థానం ఇంటి యజమానిదే అంటుంది వాస్తు శాస్త్రం. అందుకే ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజాధికాలు చేస్తాడో ఆ ఇంట్లో వారందరూ సుఖసంతోషాలతో ఉంటారు. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుంది.
ఇంటికి దీపం ఇల్లాలే!
ఇంటి యజమాని తర్వాత ఇంటి ఇల్లాలుకే పెద్దపీట వేస్తుంది వాస్తు శాస్త్రం. ఇంటి యజమానికి పూజ చేసే సమయం లేనప్పుడు ఇంటి ఇల్లాలు నిత్య పూజ చేయవచ్చు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఇంటి ఇల్లాలు పూజామందిరంలో, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి.
మహా నైవేద్యాలు తప్పనిసరా?
ఈనాటికీ ప్రాచీన సంప్రదాయం, ఆచారం పాటించే వారి ఇంట్లో పూజ పూర్తి అయిన తరువాత దేవునికి మహా నైవేద్యం సమర్పిస్తారు. మహా నైవేద్యం అంటే ఇంట్లో మడిగా అన్నం, పప్పు వండి దానిమీద ఓ చిన్న బెల్లం ముక్క ఉంచి అది భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారంతా భక్తిగా తినాలి. మహా నైవేద్యం అనేది ఇంటి ఆనవాయితీ ప్రకారం ఆచారం ఉంటేనే పాటించాలి. లేకపోతే అవసరం లేదు.
దేవునికి ఇలాంటివి నైవేద్యం పెడితే అరిష్టమే!
మహానైవేద్యం అలవాటు లేని వారు పండ్లు, కొబ్బరికాయ, పాలు వంటి సాత్విక పదార్ధాలను దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. పొరపాటున కూడా బయట దొరికే పదార్ధాలు, స్వీట్లు వంటివి దేవునికి నైవేద్యం పెట్టకూడదు. దేవునికి పక్వమైన అంటే ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టాలి. అలాగే ఆ నైవేద్యాన్ని శుచిశుభ్రతలతో చేయాల్సి ఉంటుంది. బయట ఇలా శుచిశుభ్రతలతో చేస్తారన్న నమ్మకం ఉండదు కాబట్టి బయట దొరికే పదార్ధాలు మన ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టరాదు. ఇది చాలా అరిష్టం. మన ఇల్లు స్వర్గసీమ కావాలన్నా , ఇంట్లోని వారంతా సుఖశాంతులతో ఉండాలన్నా వాస్తు శాస్త్రం చెప్పిన ఈ సూత్రాలను పాటించి ఆనందంగా ఉందాం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా? - Hanuman Jayanthi 2024