Do's And Don'ts in Kitchen As Per Vastu : చాలా మంది వాస్తును బలంగా నమ్ముతుంటారు. ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారమే పూర్తి చేస్తారు. అయితే ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని.. ఫలితంగా కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుందని, ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కిచెన్‌ను అన్నపూర్ణాదేవి నివాస స్థలంగా భావిస్తారు. మహిళలు కూడా ఎక్కువ టైమ్ అక్కడే గడుపుతారు. కాబట్టి, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజూ రాత్రి పడుకునే ముందు కిచెన్‌లో తిన్న పాత్రలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. డస్ట్‌బిన్‌లను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకోవాలట. అలాగే చెత్త డబ్బా ఎల్లప్పుడూ మూతతో కప్పి ఉండేలా జాగ్రత్తపడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
వాస్తు ప్రకారం కిచెన్ ఉంచాల్సిన వస్తువులు :
- వంటగదిలో ఎప్పుడూ మైదా, బియ్యం, ఉప్పు, పసుపు ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అంటే.. ఇవి అయిపోయేలోపు తిరిగి నింపుకోవాలి. కానీ, ఎప్పుడూ వీటిని ఖాళీ చేయొద్దని సూచిస్తున్నారు.
- వంటగది ఎప్పుడూ సమృద్ధిగా ఉండేలా చూసుకోవడానికి అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహాన్ని బియ్యం డబ్బాలో నిల్వ చేయమంటున్నారు. లేదంటే.. అన్నపూర్ణాదేవి ఫోటో కూడా కిచెన్‌లో ఉంచవచ్చంటున్నారు వాస్తు పండితులు.
- వంటగది కిటికీ దగ్గర వెదురు, తులసి, పుదీనా లేదా ఇతర మూలికల మొక్కను ఉంచండం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.
- వంటగదిలో ఉప్పును ఎప్పుడూ గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో స్టోర్ చేసుకోవాలని.. ఇది ఆర్థిక సమస్యలను దూరం చేయడంతో పాటు ఇంట్లో మంచి సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందట.
- వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను ఉంచాలనుకుంటే.. వాస్తు ప్రకారం, దానిని నైరుతి దిశలో ఉంచేలా చూసుకోమని సలహా ఇస్తున్నారు. అలాగే నైరుతి దిశ ధాన్యాలు, రోజువారీ ఉత్పత్తులను ఉంచడానికి ఉత్తమమైనదని.. ఎందుకంటే.. ఈ దిశను శుభప్రదమైనదిగా, సంపదకు అనుకూలమైనదిగా భావిస్తారని అంటున్నారు.
ఇంట్లో రెండు వంట గదులు ఉండొచ్చా? - వాస్తు నిపుణుల సమాధానమిదే! - Is Two Kitchens are Good in Duplex
కిచెన్‌లో ఉంచకూడని వస్తువులు :
- వాస్తుప్రకారం.. వంటగదిలో ఎప్పుడూ విరిగిన, పగిలిన పాత్రలను ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. అవి కిచెన్‌లో ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అప్పులు పెరుగుతాయంటున్నారు.
- వంటగదిలో మందులను ఉంచకూడదని.. ఎందుకంటే.. ఇవి కిచెన్‌లో ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందట.
- చెత్త, పాత వార్తాపత్రికలను వంటగదిలో నిల్వలేకుండా చూసుకోవాలి. అదేవిధంగా.. ఇనుము లేదా ఉక్కు పాత్రలు, డబ్బాలలో ఉప్పును స్టోర్ చేయకుండా జాగ్రత్త పడాలంటున్నారు.
- వాస్తు శాస్త్రం ప్రకారం, షూ రాక్‌ను వంటగది దగ్గర ఎప్పుడూ ఉంచవద్దని, వంటగదిలో చెప్పులు, బూట్లు ధరించకూడదని అంటున్నారు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వాస్తు పండితులు.
- కిచెన్‌లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఒకవేళ ఉంటే.. వాటిని ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవడం మంచిదట.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీ కిచెన్‌లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా!