Varalakshmi Vratham 2024 : వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వచ్చింది. సాధారణంగా ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నిమిషాల నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. అందుకే పూజను ఉదయం 10:30 లోపు, 12 గంటల తర్వాత కానీ చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని జీవితంలో డబ్బులకు లోటు ఉండదని విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
వరలక్ష్మీ వ్రతం చేసే గృహిణులు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిలిలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి శుచియై పట్టు వస్త్రాలు ధరించాలి.
పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అగరుబత్తులు, దీపారాధన కుందులు, ఆవునెయ్యి, ఒత్తులు, కర్పూరం, అక్షింతలు, పూలు, అరటి పండ్లు, అరటి పిలకలు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, తోరాలు కట్టుకోడానికి నూలు దారం, కలశానికి వెండి/ఇత్తడి/రాగి చెంబు, అమ్మవారికి నూతన వస్త్రాలు, ఆభరణాలు
పూజా విధానం
ముందుగా పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అరటిపిలకలతో, పుష్ప మాలికలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని అలంకరించుకోవాలి. సమంత్ర పూర్వకంగా అమ్మవారిని ప్రతిష్టించుకోవాలి. అనంతరం కలశంలో గంగాజలం, పూలు, అక్షింతలు వేసి మామిడి ఆకులతో అలంకరించి పైన కొబ్బరికాయను ఉంచి, దానిపై ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశం సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాన్ని మన శక్తికి తగినట్లుగా రకరకాల ఆభరణాలతో అలంకరించుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కలశానికి ముందు వైపుగా అమ్మవారి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టాలి. అన్నిటికంటే ముందుగా అమ్మవారి మహా నైవేద్యానికి కావలసిన పదార్ధాలను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజను ప్రారంభించుకోవాలి.
గణపతి పూజ
ముందుగా దీపారాధన చేసుకోవాలి. అనంతరం తమలపాకులో పసుపుతో గణపతిని తయారు చేసి షోడశోపచారాలతో పూజించాలి. అరటి పండ్లు, బెల్లం వినాయకుని నైవేద్యంగా సమర్పించాలి.
కలశ పూజ
సిద్ధం చేసుకున్న కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేస్తూ కలశపూజ చేయాలి.
వర లక్ష్మీకి షోడశోపచారాలు
అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి, షోడశోపచారాలు చేయాలి.
తోరాలు సిద్ధం
నూలు దారానికి పసుపు పూసి పువ్వులతో అమర్చి తయారు చేసిన తోరాలను అమ్మవారి ముందు ఉంచి అక్షింతలతో పూజించాలి.
అష్టోత్తర పూజ
అనంతరం కలువ, గులాబీ పువ్వులు అక్షింతలు వేస్తూ శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శత నామాలు చదువుకోవాలి. అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. అమ్మవారికి పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సంప్రదాయ ప్రసాదాలను నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి మంగళ హారతులు ఇవ్వాలి. తరువాత అమ్మవారిని తొలి ముత్తైదువగా భావించి చీర, జాకెట్టు, తోరం, పసుపు కుంకుమలతో వాయనం ఇవ్వాలి.
వ్రతకథ
పూజ పూర్తయ్యాక భక్తిశ్రద్ధలతో తోరాలను కట్టుకొని వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు ముత్తైదువులకు యధాశక్తి తాంబూలాలు, వాయనాలు ఇవ్వాలి. పెద్ద ముత్తైదువులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
వ్రత ఫలం
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఎవరైతే శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఏడాది ఆచరిస్తారో ఆ ఇంట సిరి సంపదలకు లోటుండదు. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినవారు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఎవరికైనా శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి వీలుకాకపోతే శ్రావణ మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆరోగ్యప్రదాయిని 'సూపౌదన' వ్రతం- ఈ విధంగా పూజ చేస్తే సర్వరోగాలు దూరం! - Sravana Masam Vratham 2024