Vadapalli Venkateswaraswamy History : కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఏడు శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
వాడపల్లి ఎక్కడ ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కి.మీ దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలసిన్నట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ పౌరాణిక గాథ
పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పడు తాను ధర్మ స్థాపనకు పూనుకుంటానని చెప్పారు. అలాగే కలియుగంలో అర్చా స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.
చందన పేటికలో స్వామి వారు
కొద్దిరోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు అది మాయమై పోతుండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పేటికలో శంఖ, చక్ర, గదాయుదుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్థులు సంతోషించి ఆ అర్చావతార రూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించుట ప్రారంభిస్తారు.
వాడపల్లి ఆలయ స్థల పురాణం
వాడపల్లి గ్రామాన్ని పూర్వం "నౌకాపురి" అని పిలిచేవారు. గతంలో నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా, నారద మహర్షి స్వామి వారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు.
శ్రీనివాసుని స్వప్న సాక్షాత్కారం
ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుపాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే, వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను అని మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకు చేరడం వల్ల అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ పునర్నిర్మాణం
కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్త వరదుడు అయిన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవ సేవలతో పునీతుడవై వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడు అని గుర్తించి, ఆ ఆలయంలో పూజాదికాలు ఆర్ధిక భారం లేకుండా స్వామి వారి నిత్య కైంకర్యాలకు 1759వ సంవత్సరంలో తన సొంత ఆస్తి 270ఎకరాలు స్వామివారికి సమర్పించారు.
సుందరమైన విగ్రహం
వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు.
క్షేత్ర మహత్యం
వాడపల్లి ఆలయంలో ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టాలు అయినా సరే స్వామి వారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. తరిద్దాం.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.