Tirumala Aswa Vahanam Significance : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ పులకించిపోతోంది. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా కల్కి అవతార విశిష్టతను తెలుసుకుందాం.
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి జరిగే అశ్వవాహన సేవలో కల్కి అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు.
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే! యుగే! అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కలియుగాంతంలో దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకు వైకుంఠనాధుడు కల్కి అవతారాన్ని స్వీకరిస్తాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునః ప్రతిష్ట చేసే కల్కి మూర్తి రూపం అనన్యసామాన్యం అపురూపం. అశ్వవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగే కల్కి అవతారంలో స్వామిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. అశ్వ వాహనంపై కల్కి అవతారంలో ఊరేగే శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.