Sri Rama Navami Puja at Home: హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ రోజున సీతారాముల కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా అంతటా శోభాయాత్రలను చేస్తారు. ఏటా వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు. అభిజిత్ లఘ్నంలో జగదేక వీరుడికి, జగన్మాత సీతాదేవికి అత్యంత వైభవోపేతంగా కల్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ఏప్రిల్ 17వ తేదీన బుధవారం రోజున జరుపుకోనున్నారు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర మాస శుక్లపక్ష నవమి శ్రీరామనవమి అని పండితులు అంటున్నారు. మరి ఇంతటి మహోత్తమమైన పర్వదినాన ఆ జానకీ నాయకుడి ఆశీస్సులు పొందడానికి ఇంట్లో ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచముఖి 'రుద్రాక్ష' ధరిస్తే గుండె సంబంధిత వ్యాధులు పరార్! ఈ నియమాలు పాటిస్తేనే!!
శ్రీరామ నవమి రోజున రామయ్య ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి :
- ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి.
- అలాగే కొత్త బట్టలను ధరించి, ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి.
- ఇంట్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి.
- తర్వాత ఆ శ్రీరాముడికి శ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో పూజలు చేయాలి.
- అలాగే రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి.
- ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణలోక ప్రాప్తికలుగుతుందని పండితులు చెబుతున్నారు.
- అలాగే ఈ రోజున ఆ రాముడి ఆశీస్సులు పొందడానికి రామనామస్మరణం చేయాలని, రామకోటి రాయాలని చెబుతున్నారు.
- దివ్యమైన ఈ రోజున ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పండితులు చెబుతున్నారు.
- శ్రీరామ నవమి రోజున రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
- ఇంట్లో పూజలు చేయని వారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి ఉదయాన్నే శ్రీరాముడిని దర్శించుకోవాలి. అలాగే ఆలయాల్లో జరిగే పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం వంటి కార్యక్రమాలలో పాల్గొంటే కూడా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీరామనవమి రోజు ఈ పరిహారాలు చేస్తే - కష్టాలన్నీ తొలగి సంతోషాలు మీ వెంటే!