Shivling Abhishekam Benefits In Telugu : అభిషేక ప్రియుడైన పరమ శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, ఒక్కో పరమార్థం ఉంది. మరి శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?
జలాభిషేకం-ఐశ్వర్యప్రాప్తి!
శివుడిని భోళాశంకరుడు అని అంటారు. మనం చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ఆ పరమ శివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళమును ఉంచి అభిషేకం చేయాలి.
గోక్షీరంతో సర్వ సౌఖ్యాలు!
పరమ శివుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే, ఆయన ప్రీతి చెంది మనకు సకల సౌఖ్యాలను ఇస్తాడట. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయాలి.
గోదధితో ఆరోగ్యమస్తు!
పరమశివుడికి గోదధి అంటే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవచనం. అయితే ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై బిల్వ దళాలను ఉంచి అభిషేకం చేయాలని పెద్దలు చెబుతారు.
ఆవు నెయ్యి-ఐశ్వర్యమస్తు!
ఆవునెయ్యితో పరమశివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మల్లె పూలను ఉంచి అభిషేకం చేయాలి.
చెరకు రసం- దుఃఖ నాశనం
శివుడికి చెరకు రసంతో అభిషేకం చేస్తే మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే చెరకు రసంతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై జాజి పూలను ఉంచి అభిషేకం చేయాలి.
నువ్వుల నూనె- అపమృత్యు దోష హరణం
పరమశివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్షును పొందగలం. నువ్వుల నూనెతో శివాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మందార పువ్వులను ఉంచి అభిషేకం చేయాలి.
నారికేళ జలం-సంపద వృద్ధి
పరమ శివుడికి కొబ్బరినీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం. కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి అభిషేకం చేయాలి.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా? - ఆ రోజున భక్తులు ఏం చేయాలంటే! - Hanuman Jayanti 2024 Date