Ranjangaon Ganpati Temple History In Telugu : అష్ట వినాయక క్షేత్రాలను దర్శించడానికి ఓ పద్ధతి ఉంది. ఒక వృత్తం ఎక్కడ మొదలు పెడతామో గుండ్రంగా తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేస్తాం. అలాగే అష్ట వినాయక క్షేత్రాలు కూడా ఏ క్షేత్రంలో మొదలు పెట్టి ఏ క్షేత్రంలో పూర్తి చేయాలని దానికి ఓ క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతి ప్రకారం ఇప్పటివరకు మనం మొదటి ఏడు క్షేత్ర విశేషాలు తెలుసుకున్నాం. ఈ రోజు చివరిది రంజన్ గావ్ మహాగణపతి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం
అష్టవినాయక క్షేత్రాలలో ఎనిమిదో క్షేత్రమైన రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని షిరూర్ తాలూకాలోని రంజన్ గావ్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం 9 - 10 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఆలయ స్థల పురాణం
గణేశ పురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం చేసే సమయంలో సాక్షాత్తూ పరమశివుడు యుద్ధం ప్రారంభించేముందు విఘ్నాలు తొలగేందుకు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి పూజించాడంట! మహాదేవుడు ప్రతిష్ఠించిన గణపతి కాబట్టి ఈ గణనాథునికి మహాగణపతి అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
మరో అద్భుతం
రంజన్ గావ్ మహాగణపతి ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు. అయితే అక్కడి స్థానికుల కథనం ప్రకారం ప్రస్తుతం ఉన్న వినాయకుని విగ్రహం క్రింద పది తొండాలు, ఇరవై చేతులు గల వినాయకుడి విగ్రహం ఉందని, దాని పేరు మహోత్కట్ గణపతి అని అంటారు. అయితే ఆలయ ధర్మకర్తలు మాత్రం అది నిజం కాదని చెబుతారు. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది.
సూర్యకిరణాలు నేరుగా!
ఇక ఈ గణపతి ఆలయంలో దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడేలాగా ఆలయాన్ని నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత.
పూజా విశేషాలు
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మహాగణపతి ఆలయంలో త్రికాల హారతులు, అర్చనలు జరుగుతాయి. ప్రతి బుధవారం, ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ప్రతినెలా వచ్చే సంకష్టహర చవితి రోజు స్వామికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా 10 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు.
శత్రుజయం కార్యసిద్ధి
సాక్షాత్తూ పరమశివుడే శత్రుసంహారం ముందు పూజించిన గణపతి కాబట్టి ఈ ఆలయంలో గణపతిని దర్శించి పూజిస్తే శత్రుజయం కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని కూడా నమ్మకం.
మయూర గణపతిని దర్శిస్తేనే యాత్రా ఫలం
అష్ట వినాయక క్షేత్రాలలో చివరిది ఎనిమిది అయిన మహాగణపతి క్షేత్రాన్ని దర్శించిన తర్వాత తిరిగి మొదటిదైన మయూర గణపతి క్షేత్రాన్ని దర్శిస్తేనే అష్ట వినాయక క్షేత్రాల యాత్రా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రాలను దర్శించుకుందాం సకల మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆ గుడిలో అంజన్నకు చిటికెన వేలు ఉండదు- అలా అని చెక్కితే రక్తమే రక్తం! - Hanuman Special Temple