Pasankusa Ekadashi 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. నెలా శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి రెండు ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంది. ఈ సందర్భంగా ఆశ్వయుజ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఆ ఏకాదశి విశిష్టత ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాశాంకుశ ఏకాదశి
వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం పాశాంకుశ ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించే వారికి మోక్షం లభిస్తుందని అంటారు. పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని అన్ని వయసుల వారు పాటించవచ్చు. ఈ రోజు విష్ణు మూర్తిని స్మరించినంత మాత్రాన్నే సమస్త హిందూ పుణ్య క్షేత్రాలను సందర్శించినంత పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.
పాశాంకుశ ఏకాదశి ఎప్పుడు?
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాశాంకుశ ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి కాబట్టి అదే రోజున పాశాంకుశ ఏకాదశి వ్రతం ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
పాశాంకుశ ఏకాదశి పూజకు శుభసమయం
అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9:08 నుంచి ఏకాదశి మొదలై మరుసటి రోజు ఉదయం 6:42 వరకు ఉంది కాబట్టి ఈ రోజునే ఏకాదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
పూజా విధానం
పాశాంకుశ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. ముందుగా సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు చేమంతులతో అర్చించాలి. తులసి దళాలతో అర్చిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చక్ర పొంగలి, పరమాన్నం వంటి ప్రసాదాలను నివేదించాలి.
సాయంత్రం పూజ
సాయంత్రం ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. రాత్రి భగవంతుని కీర్తనలతో, పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి.
ఈ దానధర్మాలు శ్రేష్టం
పాశాంకుశ ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యం. ఈ రోజు చేసే అన్నదానం, వస్త్రదానం, జలదానం విశేషమైన ఫలితం ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజు గోసేవ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
అకాలమృత్యు హరణం
పాశాంకుశ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీమహావిష్ణువుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి అకాల మృత్యువు తొలగిపోతుందని, శారీరక బాధలు నయమవుతాయని, వ్యాధుల నుంచి బయటపడతారని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. రానున్న పాశాంకుశ ఏకాదశి రోజు మనం కూడా శ్రీమన్నారాయణులను పూజిద్దాం ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.