Parivartini Ekadashi 2024 : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు.
పరివర్తన ఏకాదశి ఎప్పుడు
సెప్టెంబర్ 14వ తేదీ శనివారం పరివర్తన ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
ఏకాదశి పూజకు శుభ సమయం
ఈ ఏడాది పరివర్తన ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు పూజ చేసుకోవడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు.
పరివర్తన ఏకాదశి పూజా విధానం
మిగతా ఏకాదశుల మాదిరిగానే, పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై, పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీలక్ష్మీ నారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేమంతులతో నారాయణుని పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి. పూజా చేసేవారు రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి.
సాయంత్రం పూజ
ఏకాదశి రోజు సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
జాగరణ
ఏకాదశి నాటి రాత్రి భాగవత కథలు, భక్తి కీర్తనలు పాడుకుంటూ రాత్రంతా జాగరణ చేయాలి. మనసంతా దేవునిపైనే లగ్నం చేయాలి.
ద్వాదశి పారణ
మరుసటి రోజు ద్వాదశి ఘడియలు రాగానే తలారా స్నానం చేసి నిత్య పూజాదికాలు ముగించుకొని ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాల తో సత్కరించి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించవచ్చు.
పరివర్తన ఏకాదశి వ్రత ఫలం
ఈ విధంగా పరివర్తన ఏకాదశి వ్రతం శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పరివర్తన అంటే మార్పు అందుకే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ శ్రీ లక్ష్మీ నారాయణులను పూజిస్తే జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసం. అంతేకాకుండా తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు కూడా నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం. రానున్న పరివర్తన ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం మంచి మార్పు వైపుగా పయనిద్దాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.