Navratri 2024 Special Story: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రులలో భాగంగా దుర్గామాతను తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో ఆరాధించడమే కాకుండా.. ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. అయితే.. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించలేని వారు.. రోజుకో అలంకారాన్ని బట్టి ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించలేని వారు.. అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఏం చేస్తే దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- నవరాత్రులలో భాగంగా రోజూ పూజ చేయలేని వారు.. అందుకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రత్యేకమైన రోజులలో దుర్గామాతను ఆరాధించినా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
- తొమ్మిదిరోజుల పాటు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించలేనివారు "సప్తరాత్ర వ్రతం" పేరుతో తదియ తిథి నుంచి ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు. ఇలా చేసినా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయంటున్నారు.
- అలా కూడా పూజ చేయడం వీలుకానీ వారు.. "పంచరాత్ర వత్రం" పేరుతో పంచమి తిథి నుంచి 5 రోజుల పాటు దుర్గాదేవిని ఆరాధించవచ్చు.
- ఈవిధంగా కూడా చేయలేని వారు.. "త్రిరాత్ర వ్రతం" చేసుకోవచ్చు. అంటే.. దుర్గాష్టమి, మహార్నవమి, విజయదశమి కేవలం ఈ మూడు రోజులు అమ్మవారిని పూజించినా దుర్గమ్మ తల్లి అనుగ్రహం పొందవచ్చంటున్నారు. అయితే.. డైలీ దుర్గాదేవికి రాత్రిపూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
- ఇక.. ఈ మూడు రోజులూ అమ్మవారిని పూజించలేని వారు కేవలం 'నవమి రోజు' పూజ చేసినా.. నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేసిన ఫలితం పొందవచ్చంటున్నారు.
- కాబట్టి.. నవరాత్రుల్లో రోజూ పూజ చేయలేని వారు "మహార్నవమి" ఒక్కరోజు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించినా అమ్మవారి కృపకు పాత్రులు కావొచ్చంటున్నారు. లేదంటే.. రోజూ అమ్మవారిని పూజించినా విశేషమైన ఫలితం కలుగుతుందంటున్నారు.
రోజూ ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించలేని వారు ఇలా చేయండి..
- శరన్నవరాత్రులలో భాగంగా.. రోజుకొక అలంకరణాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించలేని వారు ఎవరైనా సరే.. దుర్గాదేవికి మహానైవేద్యం ప్రసాదంగా పెట్టవచ్చు.
- అంటే.. ఇంట్లో వండినటువంటి అన్నం, పప్పు, కూర, చారు, మజ్జిగ, నెయ్యి వేసి దానినే నైవేద్యంగా సమర్పించవచ్చు. దీన్నే.. మహానైవేద్యం అంటారు. ఇలా రోజూ అమ్మవారికి సమర్పించుకోవచ్చు.
- ఇక.. ఉదయం, పగలు టైమ్లో అమ్మవారిని పూజించే వారు.. కొబ్బరి, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించవచ్చు.
- సాయంత్రం, రాత్రిపూట దుర్గమ్మను పూజించేవారు.. వడపప్పు, పానకం, వేయించిన శనగలు నైవేద్యంగా నివేదించవచ్చు.
- వీటితో పాటు.. పేలాలు, చెరకు గడలు, పటిక బెల్లం వంటివి కూడా దుర్గాదేవికి ప్రత్యేక నైవేద్యాలుగా నివేదన చేసుకోవచ్చు. పైన చెప్పిన వాటిలో ఏ నైవేద్యం సమర్పించినా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి'