Hanuman Special Temple : రామనామ స్మరణ చేసిన చోట హనుమంతుడు తప్పకుండా ఉంటాడని అంటారు. హనుమంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందే మార్గం రామనామ స్మరణం ఒక్కటేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఒక్కసారి శ్రీరామా అని భక్తిశ్రద్ధలతో అంటే చాలు హనుమ మన కష్టాలన్నీ పోగొడతాడంట! అందుకే హనుమకు సంకట మోచనుడని పేరు వచ్చింది.
హనుమ ఆలయాలలోకెల్లా ప్రత్యేకం ఈ ఆలయం
మన దేశంలో హనుమంతునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకం. ఈ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
జంసన్‌వాలి హనుమ ఆలయం
Jam Sawali Hanuman Mandir History : మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఉన్న జంసన్‌వాలి ఆలయానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 22 ఎకరాలలో వెలసిన ఈ ఆలయంలో హనుమంతుడు భక్తులచేత పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం విశ్రాంతస్థితిలో ఉన్నట్లుగా ఉంటుంది. దాదాపు 18 అడుగుల పొడవు ఉండే హనుమ విగ్రహం తలపై వెండి కిరీటంతో నిద్రిస్తున్నట్లుగా ఉండడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
ఆలయ స్థలపురాణం
త్రేతాయుగంలో జరిగిన శ్రీరామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సంజీవని కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని, అందుకే ఇక్కడి హనుమ విశ్రాంత స్థితిలో ఉన్నాడని భక్తుల విశ్వాసం.
హనుమ నాభి నుంచి నీరు
ఇక్కడి హనుమంతుని విగ్రహం నాభి నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు ఎక్కడ నుంచి వస్తోందో, ఎక్కడకు వెళ్తోందో ఎవరికీ తెలియదు.
నీరే ప్రసాదం
హనుమంతుని నాభి నుంచి వచ్చే నీటినే ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఆ నీటిని భక్తులు అమృతంలా, రోగాల పాలిట సంజీవనిలా భావిస్తారు.
మొండి రోగాలను సైతం పోగొట్టే నీరు
హనుమంతుడి నాభి నుంచి వచ్చిన నీటిని అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రసాదంగా ఇస్తారు. రకరకాల అనారోగ్య సమస్యలతో ఈ ఆలయానికి వచ్చి వ్యాధుల నుంచి ఉపశమనం పొందేవరకు ఆలయ ప్రాంగణంలోనే భక్తులు నివసిస్తారు. వారికి కేవలం హనుమ నాభి నుంచి వచ్చిన నీటిని మాత్రమే ఔషధంగా ఇస్తారు. ఎలాంటి మందులు కానీ చికిత్స కానీ చేయడం ఉండదు.
ఆశ్చర్యం అద్భుతం
కేవలం హనుమ నాభి నుంచి వచ్చిన నీటిని ప్రసాదంగా, ఔషధంగా సేవించి ఎంతో మంది రోగులు స్వస్థత పొంది తమతమ ఊర్లకు తిరిగి వెళుతుండడం నిజంగా ఓ ఆశ్చర్యం! అద్భుతం!
ఆలయంలో పూజావిశేషాలు
ఇక్కడి హనుమ ఆలయం ప్రతిరోజూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా మంగళ శనివారాల్లో, పర్వదినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఇక్కడ జరిగే హారతికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ హారతి సమయంలో వచ్చే ధ్వనుల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల విశ్వాసం. మంగళ శనివారాల్లో, సెలవు దినాల్లో, శ్రీరామ నవమి, హనుమజ్జయంతి వంటి పర్వ దినాల్లో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది. అతి ప్రాచీనమైన పౌరాణిక చరిత ఉన్న ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
కోటి సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం శ్రావణ సోమవారం పూజ! ఎలా చేయాలో తెలుసా? - Sravana Masam 2024
కాశీలోని యమాదిత్యుడి ఆలయాన్ని విజిట్ చేశారా? దాని ప్రత్యేకత తెలుసా? - Kashi Yama Aditya Temple