Lord Ganesh Vastu Tips : పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాల సందర్భంగా దేవతా చిత్రాలను బహుమతులుగా అందిస్తుంటారు. కొత్తగా ఇంటిని నిర్మించేవారికి.. ఆఫీసులు, షాపులు నూతనంగా ప్రారంభించేవారికి కూడా భగవంతుల విగ్రహాలను బహూకరిస్తుంటారు. అయితే, మీకు తెలుసా? ఎవరికైనా గణపతి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటే.. వాస్తును కూడా పాటించాలట! అవును.. గణపతి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుడి విగ్రహం విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించండి!
ఈ విగ్రహాన్ని కొనకండి :
వాస్తు శాస్త్రం ప్రకారం.. నాట్యం చేస్తున్నటువంటి గణపతి విగ్రహాన్ని కొనకూడదట! అలాగే.. ఈ భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఎవరికీ గిఫ్ట్‌గా కూడా ఇవ్వకూడదట. ఎందుకంటే.. వీటిని కొనుగోలు చేయడం వల్ల వారి జీవితంలో అస్థిరత నెలకొనే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎడమవైపు అభిముఖంగా ఉన్న గణపతి :
మీరు ఇంట్లోకి గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు, ఎడమ వైపు అభిముఖంగా ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని వాస్తు నిపుణులంటున్నారు.
ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!
బాల స్వరూప్ గణేష్ :
కొత్తగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టే జంటకు గిఫ్ట్‌గా.. బాల స్వరూప్ గణేష్ విగ్రహాన్ని అందించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారికి తొందరగా సంతానం కలుగుతుందని అంటున్నారు.
సింధురి స్వరూప్ గణపతి విగ్రహం :
మీరు జీవితంలో అనుకున్న విధంగా.. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్లో రాణించలేకపోతే మీరు పనిచేసే టేబుల్ దగ్గర సింధురి స్వరూప్ గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దోషాలు అన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని తెలియజేస్తున్నారు.
సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే - వాస్తు దోషాన్ని ఆహ్వానించినట్టే!
బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు :
వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా గణపతి విగ్రహాన్ని గానీ లేదా చిత్ర పటాన్ని బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. ఇలా పెడితే, భార్యభర్తల మధ్య గొడవలు, కలహాలు రగిలే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వైవాహిక బంధం ప్రమాదంలో పడే అవకాశం ఉందట. కాబట్టి, బెడ్‌రూమ్‌లో గణపతి దేవుడికి సంబంధించి ఎటువంటివి ఉండకుండా చూసుకోండి.
- అలాగే పిల్లలు చదువులో రాణించలేకపోతుంటే.. స్టడీ రూమ్‌లో లేదా రీడింగ్ టేబుల్‌పై పసుపు లేదా లేత ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
- దేవుడి గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేవారు పసుపు రంగులో ఉండే విధంగా చూసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.
గమనిక : ఇది వాస్తు నిపుణులు చేస్తున్న సూచన మాత్రమే. మీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి.