Laxmi Puja On Amavasya Friday : హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఈ అమావాస్య వస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలనుకుంటే విశేష దానాలు, తర్పణం సమర్పించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇలా దాన, ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల సంపద, సంతానం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పితృదేవతల అనుగ్రహం కోసం ఇలా చేయాలి
అమావాస్య రోజు ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. వీలుకానివారు ఏ నదిలో అయినా స్నానం చేయవచ్చు. అదీ కుదరకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహన చేసుకుని స్నానం చేస్తే గంగా స్నానం చేసినట్లే! నదీస్నానం తర్వాత బ్రాహ్మణుల చేత మంత్రపూర్వకంగా పితృదేవతల పేరిట నదీ జలాల్లో దీపాలు విడిచి పెట్టాలి. అమావాస్య రోజు నది ఒడ్డున చేసే దానాల వల్ల పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని శాస్త్ర వచనం. అంతేకాకుండా చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గతంలో ఆగిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
లక్ష్మీ పూజకు శుభ సమయం
జులై 5వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు తిరిగి ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 లోపు పూజ పూర్తి చేసుకోవాలి.
లక్ష్మీ పూజ ఇలా చేయాలి
అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే దీపావళి అమావాస్య రోజు కూడా లక్ష్మీదేవిని పూజించే ఆనవాయితీ ఉంది. శుక్రవారం నువ్వుల నూనెతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే ఈ రోజు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవి సమక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం గులాబీలు, కలువ పూలతో అమ్మవారిని అలంకరించాలి. శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు చదువుకోవాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాయసాన్ని నివేదించాలి. ఈ విధంగా అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రధ్ధలతో పూజిస్తారో వారి ఇంట ధనానికి ఎప్పుడు లోటు ఉండదు. ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అఖండ ఐశ్వర్యంతో, సిరిసందలతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజు మనం శ్రీమహాలక్ష్మిని ప్రార్థిద్దాం అష్టైశ్వర్యాలను పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మాస శివరాత్రి ప్రాశస్త్యం - గురువారం ఇలా పూజిస్తే సకల సంపదలు ఖాయం! - Masa Shivratri Puja