Kojagiri Purnima Vrat Katha : ఏ పూజ అయిన వ్రతమైనా పూజా విధానం పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతఃఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. దారిద్య్ర బాధలను పోగొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే కోజాగరి పౌర్ణమి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం కదా! కోజాగరి పౌర్ణమి వ్రత కథను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కోజాగరి పౌర్ణమి వ్రత కథ
పూర్వం నైమిశారణ్యంలో వాలఖిల్య మహర్షి ఆశ్రమంలో ఇతర మహర్షులు లోకకల్యాణం కోసం దారిద్య్రం తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని వాలఖిల్య మహర్షిని కోరగా మహర్షి ఇలా వివరించసాగాడు.
పేద బ్రాహ్మణుని కథ
పూర్వం మగధ దేశంలో "వలితుడు'' అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడు. వేదవేదాంగాలు చదివిన వలితుడు గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. వలితుని భార్య చండి పరమ గయ్యాళి. ఈమె తనకు బంగారం, పట్టు వస్త్రాలు సమకూర్చడం లేదని వలితుడి మాటలను ధిక్కరించి అతనికి వ్యతిరేకంగా ఉండేది.
వలితుని మిత్రుని ఉపాయం
వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి, ఆలోచించి "నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకమైన పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది'' అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు "రేపు మా తండ్రిగారి ఆబ్ధికం, అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు'' అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో ఏమరుపాటుతో వలితుడు భార్య చండితో "పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి'' రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. భార్య చండి చర్యకు వలితుడి మనస్సు విరిగి విరక్తితో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్లిపోయాడు.
నాగ కన్యలతో పాచికలాడిన వలితుడు
వలితుడు ఇలా అరణ్యవాసం చేస్తుండగా కొంతకాలం తరువాత ఆశ్వయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. నాగ కన్యలు ముగ్గురు వలితుడు ఉన్న ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వలితుడు నిరాకరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగ కన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు.
లక్ష్మీనారాయణుల భూలోక విహారం
ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి కావడం వల్ల లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా, వారికి ఈ ముగ్గురు నాగ కన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలఖిల్య మహర్షి వివరించాడట. కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఆ రాత్రి జాగరణ చేస్తూ, పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కోజాగరి పౌర్ణమి వ్రతం చేసుకున్నవారు ఈ వ్రత కథను చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పురాణం వచనం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.