Is Ganesh Chaturthi September 6 Or 7 : హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ గణేష్ చతుర్థి. ఈ పండుగ భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదో రోజు జరిగే గణేష్ నిమజ్జనంతో పండుగ ముగిసిపోతుంది. ఈ సందర్భంగా వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలనే కొన్ని సందేహాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో పంచాంగ కర్తలు ఏమంటున్నారు తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వినాయక చవితి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7, 2024 శనివారం సాయంత్రం 5:35 గంటల వరకు కొనసాగుతుంది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అందుకే సెప్టెంబర్ 7వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
గణేష్ పూజకు శుభ ముహూర్తం
పంచాంగ కర్తలు సూచించిన ప్రకారం వినాయకుని పూజకు సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 1:03 AM నుండి 01:34 PM వరకు శుభ సమయం.
వినాయకుని పూజ ఎందుకు చేస్తారు?
భాద్రపద శుద్ధ చవితి రోజు పరమశివుడు వినాయకునికి గణాధిపత్యం ఒసంగిన రోజు. అందుకే ఈ రోజు తాము చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు. అందుకే వినాయకుని విఘ్ననాయకుడని అంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించడం సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఏ పనిని మొదలు పెట్టరు. అందుకే అన్ని పండుగలలో వినాయక చవితికి ప్రథమ స్థానం. అందుకే మనమందరం పండుగ ఎప్పుడు అనే సందేహాలను పక్కన పెట్టి పంచాంగ కర్తలు సూచించిన ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుందాం. ఆ గణనాధుని ఆశీర్వాదంతో ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుదాం.
- ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
భాద్రపద మాసం స్పెషల్ - వినాయక చవితితో పాటు ముఖ్యమైన పండగలివే! - Bhadrapada Masam 2024