How To Impress Goddess Laxmi : పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కొన్ని స్థానాల్లో స్థిర నివాసం ఉంటుందని అంటారు. ఆవు పాలు, తాజా పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం, బంగారం, వెండి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెబుతారు. అందుకే ఈ వస్తువులను పొరపాటున కూడా నేల మీద పెట్టరాదు. కాలితో తన్నరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
వీరియందే లక్ష్మీదేవి అనుగ్రహం!
పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఇలాంటి వారిని అనుగ్రహిస్తుందని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే అంటే నిజాన్నే మాట్లాడే వారిపట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అసత్యం చెప్పకూడదు. పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటుండదు.
ఎవరైతే నిస్సహాయులకు చేయూత నిచ్చి ఆదుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మూగజీవాల పట్ల జాలి, దయ చూపించే వారికి ఎప్పుడు ధనానికి లోటుండదు. ఎవరైతే తనకున్నంతలో దానధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటుండదు. ధర్మబద్ధంగా తాను సంపాదించిన దానిలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. దైవ కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి దానం చేసిన దానికి పదిరెట్లు కలిసివస్తుంది.
లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లో ఉండనే ఉండదు
సూర్యాస్తమయం వరకు నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే సంధ్యా సమయం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో నిద్రించండం అరిష్టం. ఇలాంటి చోట సిరిసంపదలు ఉండవు. కష్టపడి పని చేయకుండా సోమరితనంతో ఉండేవారికి లక్ష్మీ కటాక్షం కలుగదు. ఏ ఇంట్లో అయితే నిత్యం కలహాలు కాపురం చేస్తాయో లక్ష్మీదేవి ఆ ఇంట అసలు అడుగు పెట్టదు. చివరగా ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.