How To Do Laxmi Puja On Friday : హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు ఇంట్లో లక్ష్మీ దేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుందని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని విశ్వాసం. అసలు ఎలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం ఇంటి ముంగిట ముగ్గులు ఎలా వేయాలి?
శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులను తప్పనిసరిగా వేయాలి. ముగ్గు మధ్య భాగంలో పసుపు కుంకుమ ఉంచాలి. రంగురంగుల రంగవల్లికలు తీర్చి దిద్దితే ఇంకా మంచిది.
శుక్రవారం గడప పూజతో సకల శుభాలు!
శుక్రవారం రోజు మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి ముందుగా పసుపు పూయాలి. అనంతరం కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి గడపకు రెండు వైపులా పువ్వులను ఉంచాలి. ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి.
పరిశుభ్రతే దైవత్వం- లక్ష్మీకటాక్షం కావాలంటే ఇల్లు ఇలా ఉండాల్సిందే!
మనం ఎప్పుడైనా మనకు ఉన్నంతలో ఇంట్లోని వస్తువులు చిందర వందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి. ఇల్లు అంతా వస్తువులతో దుమ్ముతో నిండి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఇంట్లో పగిలిపోయిన, పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలు. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత దైవత్వం అని తెలుసుకోవాలి. ఇంట్లో బూజులు ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
పూజామందిరాన్ని ఇలా తీర్చిదిద్దుకుంటే ఐశ్వర్య ప్రాప్తి!
కొందరిశాలంగా శుభ్రంగా ఉంటుంది కానీ పూజామందిరాన్ని మాత్రం పట్టించుకోరు. రోజు ఏదో కొన్ని నిముషాలే కదా అక్కడ ఉండేదని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పూజామందిరంను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనం నివసించే ఇంటినే అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మరి దేవుని ఇంటిని ఇంకెంత శుభ్రంగా చూసుకోవాలో కదా! అందుకే పూజా మందిరంలో అక్కర్లేని పుస్తకాలూ ఇతర వస్తువులు పెట్టకుండా మీ సంప్రదాయాన్ని అనుసరించి దేవుని విగ్రహాలను కానీ, పటాలను కానీ అమర్చుకోవాలి.
శుక్రవారం లక్ష్మీపూజా విధానం
పూజామందిరంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పీటపై లక్ష్మీదేవి చిత్రపటం కానీ, విగ్రహం కానీ ఉంచాలి. ఇప్పుడు అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి.
శుక్రవారం ఆవునేతితో దీపం సకల ఐశ్వర్యకారకం
దీపారాధన కోసం వెండి కుందులు గాని, ఇత్తడి కుందులు గాని, మట్టి ప్రమిదలు గాని తీసుకొని అందులో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి రెండు గాని అయిదు గాని ఒత్తులు వేసి ప్రమిద నిండుగా ఆవు నేతిని పోసి దీపారాధన చేయాలి. వెలిగించిన దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి. శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తే దృష్టి దోషాలు పోతాయి కాబట్టి ధూపం వేస్తే మంచిది. వీలు కానీ వారు అగరుబత్తీలు వెలిగించినా సరిపోతుంది. లక్ష్మీ అష్టోత్తరం గాని, సహస్రనామాలు గాని మీ సమయానుసారం చదువుకోవాలి. చివరగా కొబ్బరికాయ, పళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించాలి.
శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన నివేదన ఏది?
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చిన్న పాత్రలో పచ్చి పాలు, తేనె, పచ్చ కర్పూరం, యాలకులు వంటివి సమర్పిస్తే అమ్మవారు సంతుష్టులు అవుతారంట. ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలన్నా, సువాసనాలన్నా ఎంతో ఇష్టం. చివరగా కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించుకోవాలి. ఇలా నియమానుసారంగా 5 గాని 9 గాని శుక్రవారాలు పూజిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావడం తథ్యం.