Lalitha Tripura Sundari Devi Avataram Significance : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు నాలుగో రోజు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం
శరన్నవరాత్రులలో నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరీ నామంతో పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు.
సచామర రమావాణీ
ఓ వైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీ దేవి వింజామరలు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరీ దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
శ్లోకం
"సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా" అంటూ అమ్మవారిని సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఈ రోజు లలితా సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. బంగారు రంగు చామంతులతో అమ్మను పూజించాలి.
ప్రసాదం
ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను సమర్పించాలి. ఆ లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక! శ్రీ మాత్రే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.