Dos and Don'ts on Vasant Panchami 2024: హిందూ ధర్మంలో వసంత పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజే సరస్వతీ దేవి జన్మించిందని పురాణాల్లో పేర్కొన్నారు. సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో కచ్చితంగా వెలుగులు నిండుతాయని, చీకటికి అస్సలు చోటు ఉండదని చాలా మంది నమ్ముతారు. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యా దేవత అయిన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున వాగీశ్వరి జయంతి, రతి కామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మర్చిపోయి కూడా పండగ నాడు కొన్ని పనులు చేయకూడదు. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రంగుకు దూరంగా ఉండటం: వసంత పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీరు ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించినట్లే అవుతుంది. అందుకే ఈరోజున నలుపు రంగు దుస్తులను పక్కకు పెట్టండి. ఈరోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
మాఘశుద్ధ పంచమి: జ్ఞానదాయిని సరస్వతి సాకారమైన రోజు
మొక్కలను కత్తిరించవద్దు: వసంత పంచమి పండగ పచ్చదనం, పంటలకు సంబంధించింది. అందువల్ల ఈ రోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కలను నరకడం లేదా తొలగించడం లాంటివి చేయకూడదు. వసంత పంచమి రోజున వసంత ఆగమనం వస్తుంది. కాబట్టి మొక్కలు నరకకూడదు. అలాగే ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలకు తావు లేకుండా చూసుకోవాలి. లేకుంటే సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
ఆహారం తినవద్దు: ఈ రోజు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దు. ధర్మ శాస్త్రం ప్రకారం, వసంత పంచమి రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదని చెబుతారు. వీలైతే, ఈ రోజున ఉపవాసం ఉండి సరస్వతీ అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి.
చెడుగా ఆలోచించకు: వసంత పంచమి రోజున ఎవరూ తమ మనసులో చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు. మనసులో చెడును కోరుకోకుండా ఉండటమే కాదు. ఈ రోజు చెడు మాటలు కూడా మాట్లాడకూడదు. ఈ రోజు మనం ఇతరులకు చెడును కోరితే, అది మనకు చెడు చేస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు చెడుగా ఆలోచించేవారికి జ్ఞానం తగ్గిపోతుందని పురాణాల్లో పేర్కొన్నారు.
జీవహింసకు దూరంగా: వసంత పంచమి రోజున పూజ చేసినా, చేయకపోయినా కొన్ని పనులు చేయడం మాత్రం మరవకండి. అందులో ఈ రోజు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా వసంత పంచమి రోజున వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది.
వసంతి పంచమి స్పెషల్ - సరస్వతీ దేవికి ఇష్టమైన ప్రసాదాలు ఇవే!