Dhantrayodashi 2024 Date : హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెలుగుల పండగ దీపావళికి ముందు వచ్చే ఈ పర్వదినాన్ని 'ధంతేరాస్' అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి రోజున.. ధన త్రయోదశి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్ 29వ తేదీ మంగళవారం రోజున వచ్చింది.
ధన త్రయోదశి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజన ఉదయం లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటూ కలగదని, అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని భక్తులు నమ్ముతారు. అయితే, ధంతేరాస్ రోజున లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేయాలో ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్ కుమార్' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
పూజ ఇలా చేయండి..
- ధన త్రయోదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయండి. కొత్త చీరను ధరించండి. పూజ మందిరంలో ధనలక్ష్మీ చిత్రపటం లేదా పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
- అలాగే ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను పాలతో కడగండి. ఆ తర్వాత నీటితో శుద్ధి చేయండి. వీటిని ధనలక్ష్మీ పూజలో ఉంచాలి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఆభరణాలకు కూడా ఇవ్వాలి.
- అగరు బత్తులను ఆభరణాలకు చూపించాలి. పూజ పూర్తైన తర్వాత వాటిని బీరువాలో భద్రపరచుకోవాలి.
- ధనలక్ష్మీ చిత్రపటం లేదా లక్ష్మీదేవి విగ్రహం ఎదురుగా వెండి ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి.
- ఆ తర్వాత లక్ష్మీదేవిని కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమతో పూజించాలి. దీనినే 'చంద్ర' అని పిలుస్తారు. లేదా ఆకుపచ్చ రంగులో కుబేర కుంకుమ అని ఉంటుంది.. దానితో పూజించండి.
- లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రం 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం "ఓం శ్రీం శ్రియ నమః".
- ఆ తర్వాత దానిమ్మ గింజల్లో కొద్దిగా తేనె కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి.
ధనవృద్ధి కలగడం కోసం ధన త్రయోదశి రోజున ఇలా చేయండి..
- ఉదయం ధనలక్ష్మీ పూజ చేసిన తర్వాత అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి.
- ఆ తర్వాత ఆరుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి కాళ్లకు పసుపు రాయండి.
- తర్వాత పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఒక జాకెట్ ముక్క, కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయినం ఇవ్వాలి. పూజ అనంతరం ఇంట్లోని మహిళలు ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుంది.
- ఈ విధంగా ధన త్రయోదశి రోజున ప్రత్యేకమైన విధివిధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
రుద్రారం గణేశ్ మహిమ- 11 ప్రదక్షిణలు చేస్తే చాలు- కోర్కెలు తీరడం ఖాయం!
రుణ విముక్తి కోసం లక్ష్మీదేవి పూజ - శుక్రవారం ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలు మీ సొంతం!