Chintamani Ganpati Temple: హిందూ సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుని పూజించనిదే ఏ పనిని మొదలు పెట్టరు. మహారాష్ట్రలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఐదవ క్షేత్రం చింతామణి గణపతి క్షేత్రం. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఆ క్షేత్ర విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతామణి గణపతి క్షేత్రం ఎక్కడ ఉంది
విదర్భ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకునే చింతామణి గణపతి క్షేత్రం మహారాష్ట్ర పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ చింతామణి దేవాలయం యావత్మాల్ నుండి 22 కి.మీ దూరంలో కలాంబ్ వద్ద ఉంది.
ఆలయ స్థల పురాణం
ఈ ఆలయంలో వినాయకుడికి చింతామణి గణపతిగా పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి చింతామణిని గణపతి మెడలో అలంకరిప్తాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా భక్తులు పూజిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.
ఆలయంలో విశేష పూజలు
చింతామణి గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.
దర్శనఫలం
చింతామణి గణపతి ఆలయంలో గణపతిని దర్శించి పూజిస్తే ఎలాంటి చింతలైనా దూరమవుతాయని, కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు.
ఎలా చేరుకోవాలి
చింతామణి గణపతి ఆలయాన్ని చేరుకోవడానికి విమానం కానీ, రైలులో కానీ పుణెకు చేరుకుంటే అక్కడ నుంచి సులభంగా స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. కోరిన కోర్కెలు తీర్చే చింతామణి గణపతిని మనం కూడా దర్శిద్దాం మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.
ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సర్వ విఘ్నాలు తొలగించే బల్లాలేశ్వర్ గణపతి! ఆ దివ్య క్షేత్రం ఎక్కడుందంటే? - Famous Ganapati Temple