Dont Do These Mistakes in Tirumala Darshan: తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ.. ఆ తిరుమలేశుడి దర్శనం చేసుకుంటారు. అయితే.. స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలని.. ఆ తర్వాతే వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే.. తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీవరాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి, ఆపై ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని కోరుకున్నారంట. ఇందుకు శ్రీనివాసుడు సమ్మతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల అర్చక స్వాములు మొదటిది తప్ప.. మిగిలిన రెండింటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులే. అందుకే భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు.
ప్రాపంచిక సుఖాలను కోరుకోకూడదు: తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్లే వారు.. దానిని విహార యాత్రగానో మరోరకంగా భావించి వెళ్లకూడదు. కొంతమంది సందర్శకులు షాపింగ్, విందులు, వినోదం ఎంజాయ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే వెళ్తారు. అంతే కాకుండా ప్రాపంచిక సుఖాల కోసం అసలు వెళ్లకూడదు. కొత్తగా పెళ్లైన వారు.. ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం మన పెద్దలు పెట్టడానికి కారణం కూడా ఇదే అంటున్నారు పండితులు.
స్వామివారి భక్తులకు గుడ్న్యూస్ - ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్!
దొంగ దర్శనాలు చేసుకోకూడదు: భక్తులందరికీ సాఫీగా ఆ స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల దేవస్థానం నిర్దిష్ట నియమాలను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది భక్తులు తిరుమల దేవస్థానానికి తరలివస్తుంటారు. అయితే కొద్ది మంది దొంగ దర్శనాలు చేసుకుంటారు. మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే స్వామి వారి అనుగ్రహం కలగదని అంటున్నారు.
మాఢవీధుల్లో చెప్పులు నిషిద్ధం: మాఢవీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదని పండితులు చెబుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు పరమ పవిత్రమైనవని.. అక్కడ పాదరక్షలు వేసుకుని తిరగరాదని అంటున్నారు.
తిరుమలలో భక్తులు పుష్పాలకు దూరంగా ఉండాలి: తిరుమలలో స్వామిని మాత్రమే పూలతో అలంకరించాలి. తిరుమలలో పూసిన ప్రతీ పువ్వు స్వామి వారి కైంకర్యాలకి మాత్రమే ఉపయోగపడాలి. స్వామికి ఉపయోగించిన నిర్మాల్యాలను కూడా ఎవరికీ ఇవ్వకుండా భూతీర్థంలో చూపించి అడవిలో వదిలిపెడుతుంటారు. తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ, ఈ నిబంధన తరచుగా ఉల్లంఘిస్తున్నారు.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ టికెట్లను తగ్గించిన టీటీడీ - అప్పటి నుంచే అమలు!
తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల - ఏ రోజు ఏం చేస్తారంటే?
తిరుమలపై జరుగుతున్న ఆ ప్రచారం అబద్ధం - భక్తులు అలా చేయొద్దు - స్పందించిన టీటీడీ