Astrology for Work Dates : చాలా మంది కొత్తగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే.. జ్యోతిష్యుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. వారు చెప్పిన విధంగా ప్రత్యేకమైన తేదీల్లో పనులు ప్రారంభిస్తుంటారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో.. ఏయే తేదీల్లో ఎలాంటి పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
1, 10, 19, 28 తేదీలు : ఈ తేదీలు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మంచివి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారులతో చర్చలు చేయవచ్చు. వ్యాపారం చేసేవారు ముఖ్యమైన లావాదేవిలను నిర్వహించుకోవచ్చు. అలాగే.. ముఖ్యమైన దస్తావేజులు చేయించుకుంటే మేలు. రాజకీయ వ్యవహారాలు, న్యాయ సంబంధమైన వ్యవహారాలు, సాహస కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఈ తేదీల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
2, 11, 20, 29 తేదీలు : ఈ తేదీల్లో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది. ఉద్యోగం వచ్చిన వారు చేరవచ్చు. నీటి మీద ప్రయాణాలు చేయాలన్నా, నీటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా ఈ తేదీలు అనుకూలం. అలాగే ఇల్లు మారవచ్చు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పాత్రలు కొనుగోలు చేయడానికి, లేదా కొత్త పాత్రలు వాడుకున్నా మంచిది.
3, 12, 21, 30 తేదీలు : ధనాన్ని దాచుకోవడానికి ఈ తేదీలు అనుకూలం. కొత్తగా బ్యాంకు ఖాతా తెరచుకోవచ్చు. అలాగే బ్యాంకులో నగదు జమ చేస్తే మంచిది. వివాహపరమైనటువంటి చర్చలు చేసుకోవడానికీ ఈ తేదీలు మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయడానికి అనుకూలం. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు ఏదైనా కోర్సులు నేర్చుకోవడానికి ఈ తేదీలు మంచివి.
4, 13, 22, 31 తేదీలు : సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ తేదీలు అనుకూలం. ఆలయ సందర్శన చేయవచ్చు. వ్యాపార ప్రచారాలు సత్ఫలితాలను ఇస్తాయి. అధికారులను కలిసి కీలకమైన చర్చలు చేస్తే మేలు జరుగుతుంది.
5, 14, 23 తేదీలు : జ్యోతిష్య, గణిత విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం. ప్రయాణాలు చేయాలనుకునే వారు కీలకమైన చర్చలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది.
6, 15, 24 తేదీలు : ఇంట్లో శుభకార్యక్రమాలు చేసుకోవడానికి ఈ తేదీలు అనుకూలం. కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవచ్చు. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, అలాగే కొత్త బట్టలు ధరించడానికి అనుకూలం. నిశ్చితార్థం చేసుకోవచ్చు.
7, 16, 25 తేదీలు : వైద్య సేవలకు ఈ తేదీలు మంచివి. భూములు, గృహా క్రయ విక్రయాలకు అనుకూలం. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుంది. సాహసోపేతమైన పనులు చేసే వారికి అనుకూలం.
8, 17, 26 తేదీలు : ఈ తేదీల్లో ఇనుము, మినుములు, నువ్వులు, నువ్వుల నూనె యంత్ర పరికరాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. సేవకులను నియమించుకోవచ్చు.
9, 18, 27 తేదీలు : భూములు, గృహాల క్రయ విక్రయాలకు అనుకూలం. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుంది. సాహసోపేతమైన పనులు, వైద్య సేవలను నిర్వహించవచ్చు.
ఇలా నెలలో ప్రత్యేకమైన తేదీల్లో పనులు ప్రారంభించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే - అపార ధనలాభం కలుగుతుందట!
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? - అగ్గిపుల్లతో దీపారాధన చేయవచ్చా?