YSRCP Leaders Irregularities : అతను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతని మేనమామ ఆ ప్రాంత జడ్పీటీసీ సభ్యుడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పారు. అప్పటి ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. మామ చాటున అల్లుడు చెలరేగిపోయారు. తమ కంపెనీ ద్వారా రాయితీపై తక్కువకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు.
అధికార పార్టీ నేత అల్లుడు కావడంతో రైతులు నమ్మేశారు. అడిగిందే తడవుగా అందిన కాడికి అప్పులు చేసి రూ.లక్షలు సమర్పించారు. ఎంతకీ ట్రాక్టర్లు, పరికరాలు రాకపోవడంతో నిలదీశారు. అతనేమో తానేం చేయలేనంటూ చేతులెత్తేశారు. డబ్బులు తిరిగివ్వాలని అడుగుతుంటే రేపూమాపంటూ తప్పించుకుంటున్నారు. బాధితులేమో న్యాయం చేయాలని కోరుతూ పోలీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
తక్కువ ధరలకు ఇప్పిస్తానంటూ మోసం : వైఎస్సార్సీపీ తాళ్లూరు జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి. అతని మేనల్లుడు నాగార్జున రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. తమ సంస్థ ద్వారా రైతులకు ట్రాక్టర్లు, ట్రైలర్లు, రోటా వేటర్లు, ఇతరత్రా వ్యవసాయ పరికరాలు రాయితీపై తక్కువ ధరలకు ఇప్పిస్తానంటూ పలువురు రైతులను నాగార్జున రెడ్డి నమ్మించారు. ముందుగా తనకు బాగా తెలిసిన కొందరికి రాయితీపై ఇప్పించారు. నమ్మకం కుదిరాక దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు బాపట్ల జిల్లా అద్దంకిలోనూ రైతుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
కార్యాలయం బయటే పంచాయితీ : నాగార్జునరెడ్డి తన మేనమామ పలుకుబడిని ఉపయోగించి గ్రామ స్థాయిలో కొందరు నాయకులపై వల విసిరాడు. అతని మేనమామ జడ్పీటీసీ సభ్యుడు కావటం, ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వారే ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారు. మాది హామీ అంటూ రైతులతో నాగార్జున రెడ్డికి డబ్బులు ఇప్పించారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు కావాలంటే నగదుతో చిలకలూరిపేటలోని తమ కార్యాలయం వద్దకు రావాలని అతను చెప్పేవారు. రైతులు అక్కడికి వెళ్తే లోనికి రానిచ్చేవారు కాదు. కార్యాలయం బయటే ఉంచి తమ అధికారులంటూ ఒకరిద్దరిని పిలిచి మాట్లాడించేవారు. అనంతరం రైతుల నుంచి సొమ్ము తీసుకునేవారు. త్వరలోనే పరికరాలు అందుతాయని నమ్మబలికేవారు. 2022 నుంచి సుమారు 300 మందికి పైగా రైతుల నుంచి ఈ తరహాలో నాగార్జున రెడ్డి నగదు వసూలు చేశారు.
పొలాలను తాకట్టు పెట్టి నగదు చెల్లింపు : 4 మండలాల్లో సుమారు మూడు వందల మందికి పైగా నాగార్జునరెడ్డి బాధితులు ఉన్నారు. ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రైలర్లు, వంటి వ్యవసాయ పరికరాలు సాగుకు ఉపయోగపడతాయన భావించిన పలువురు, తమ వద్ద నగదు లేకపోయినా అప్పులు తెచ్చారు. భార్యల పుస్తెలతాడు బ్యాంకులో తనఖా పెట్టినవారూ ఉన్నారు. మరికొందరు తమకు జీవనాధారమైన పొలాలను తాకట్టు పెట్టి నగదు చెల్లించారు. ఈ మొత్తం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వక్తం చేస్తున్నారు.
'పుంగనూరు పెద్దాయన' పాపాల పుట్ట - గత ఐదేళ్లు అంతులేని అరాచకాలు - YSRCP Leaders irregularities
వైఎస్సార్సీపీ ఓటమి - జిల్లా స్థాయిలో ఆందోళనకు సిద్ధం : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత కాలం నాగార్జున రెడ్డిని బాధిత రైతులు నేరుగా నిలదీసే సాహసం చేయలేకపోయారు. తమ డబ్బు చేతికి వస్తుందా రాదా? తాకట్టు పెట్టిన బంగారం, పొలాలను తిరిగి విడిపించుకోగలమా? అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవ్వడంతో వారి రాజకీయ ప్రాబల్యానికి గండి పడింది. దీంతో బాధిత రైతుల్లో ధైర్యం వచ్చింది. గత కొన్నిరోజులుగా తమ డబ్బు తిరిగి రాబట్టుకోవటానికి నాగార్జునరెడ్డిని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో అతను అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై బాధిత రైతులు కొందరు ఇటీవల జిల్లా ఎస్పీ దామోదర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
తాజాగా సుమారు 100 మందికి పైగా బాధిత రైతులు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని బుధవారం ఒంగోలులో కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. కడుపు మండిన మరికొందరు మోసంపై జిల్లా స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీంతో నాగార్జునరెడ్డి తమ స్వగ్రామం కొత్తపాలెంలో సమావేశం పెట్టి రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.