Nara Lokesh Mangalagiri Visit: రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సుమారు 130 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రబాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశంలో చేరారు.
ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు: 2019లో తాను ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉండి దాదాపు 29 కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈసారి తనను 53వేల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని నారా లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో ముందు చూపుతో వ్యవహరించామని, ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో అనంతపూరం జిల్లాలో కీయా మోటార్స్ ఏర్పాటు చేయడంతో ఆ జిల్లా తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఆటోమెుబైల్ రంగాన్ని ప్రోత్సహించామని, మంగళగిరిలో సైతం బంగారం తయారీ కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే మంగళగిరిని మరింత అభివృద్ది చేస్తానని లోకేశ్ పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయం -నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
5సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధిని పునఃప్రారంభిస్తాం-లోకేష్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ పోరంబోకు, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను ఇస్తామని లోకేశ్ తెలిపారు. తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలోని దళితవాడ, ముగ్గురోడ్డు, హోసన్నా మందిరం ప్రాంతాల్లో లోకేశ్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి పట్టాలు, తాగునీరు, స్థలాల క్రమబద్దీకరణ చేయించి ఇవ్వాలని ప్రజలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేశ్ ముందు వాపోయారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లి అడ్డుకుంటే చీపుర్లతో తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది- అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి : నారా లోకేశ్
తాడేపల్లిలోని పలువురు తటస్థ ప్రముఖులతో నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 20వ వార్డులో నిర్మాణ సామగ్రి వ్యాపారి మలిశెట్టి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేతను ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు వ్యాపారంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. ఇసుక అందుబాటు ధరల్లో లేకపోవడంతో అన్నిరకాల నిర్మాణాలు దెబ్బతిన్నాయని తెలిపారు. లోకేశ్ స్పందిస్తూ, మరో రెండునెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీని తెచ్చి నిర్మాణ రంగానికి గత వైభవం చేకూరుస్తానని భరోసా ఇచ్చారు.
లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు- సమస్యలు పరిష్కరిస్తామని హామీ!