YSRCP leaders Involvement in Visakha Drug Case : బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రైడ్ ఈస్ట్‌లో మాదకద్రవ్యాలు వెలుగు చూసిన ఘటన ఏపీలోని అధికార వైఎస్సార్సీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రతిపక్షాలకు సంబంధించి ఎటువంటి తప్పు లేకపోయినా ఓ రేంజ్లో రెచ్చిపోయే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఈ విషయంలో ఎందుకో స్పందించడం లేదు. అధికార పార్టీ సోషల్ మీడియా కనీసం ఈ ఆరోపణలపై ఎటువంటి ఎదురు సమాధానం కూడా ఇవ్వడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Visakha Drug Bust Update : విశాఖ తీరాన రూ. 50వేల కోట్ల డ్రగ్స్ కంటైనర్ను సీబీఐ స్వాధీనం చేసుకోగానే అధికార వైసీపీపై విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తానని చెప్పి దేశానికి గంజాయి రాజధానిగా మార్చిన వైసీపీ అంతటితో ఆగక విశాఖను అంతర్జాతీయ డ్రగ్స్ హబ్ మార్చి పరువు తీసిందంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
ఇరకాటంలో పడేసిన నంబర్-2 ట్వీట్ : విశాఖ డ్రగ్స్ కేసులో ఓ పక్క ప్రతిపక్షాలు, మరో పక్క సోషల్ మీడియా అంతా అధికార పార్టీని తీవ్రంగా దూషిస్తుంటే, ఆ పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కనీసం స్పందించడం లేదు. అందుకు కారణం డ్రగ్స్ దిగుమతి చేసుకొన్న కూనం వీరభద్రరావు వైసీపీ వ్యక్తి కావడం, డ్రగ్స్ వచ్చిన బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కీర్తిస్తూ గతంలో పార్టీలో నంబర్-2 అయిన విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం వైసీపీని ఇరకాటంలో పడేశాయి.
ట్వీట్ దుమారం: వైఎస్సార్సీపీపై ఒంటికాలుతో లేచే అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారంపై స్పందించారు. విజయసాయిరెడ్డి 2022 అక్టోబర్ 31న బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లూల డా సిల్వాను అభినందిస్తూ చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. 'అమ్మ దొంగలారా, బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైతే వైసీపీ ట్వీట్ చేయడం అవసరమా? అనుకొన్నా అప్పుడు, అసలు గుట్టు తెలిసింది ఇప్పుడు' అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం విశాఖలో పట్టుబడ్డ ద్రగ్స్ బ్రెజిల్ నుంచే దిగుమతి కావడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - Vizag Drug Bust
విజయసాయి రెడ్డి గతంలో చేసిన ట్వీట్: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు అభినందనలు అంటూ 2022 అక్టోబర్ 31న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తుందని ఆ ట్విట్లో పేర్కొన్నారు. అనేక సంవత్సరాల విభజించి పాలించే సిద్దాంతానికి ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ముగబోయిన వైసీపీ సోషల్ మీడియా: గతంలో వీరభద్రరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల చెక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు వైసీపీ అభిమానులు సంధ్య ఆక్వా అధిపతి కూసం వీరభ ద్రరావు ఫొటోతో పత్రికల్లో ఇచ్చిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కూనం వీరభద్రరావు కుటుంబం ఈదుమూడికి వచ్చింది. ఆ సందర్భంగా వీరభద్రరావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సోదరుడు పూర్ణచంద్రరావు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిని స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సమక్షంలో కలిసిన పూర్ణచంద్రరావు గ్రామ, మండల రాజకీయాల గురించి చర్చించారు.
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితుడనే అంశాలు సామాజిక మాధ్యమ వేదికగా వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన వీరభద్రరావు కుటుంబం వైఎస్సార్సీపీలోనే ఉంది. సహకార పరపతి సంఘం త్రీమెన్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన సోదరుడు పూర్ణచంద్రరావును వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నియమించింది. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డితో రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. గ్రామంలోనూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవన్నీ వైరల్ అవుతున్నాయి.
పూర్ణచంద్రరావు కుమారుడైన హరికృష్ణ.. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2020లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంధ్య ఆక్వా నుంచి కాలుష్యం వెలువడుతోందనే పేరుతో తనిఖీలు చేసి హడావుడి చేసింది. ఆ తర్వాత వారు వైఎస్సార్సీపీ నేతలకు మరింత దగ్గరయ్యారు. భాగస్వాములతో కలిసి రొయ్యల ఎగుమతి వ్యాపారం చేసే వీరభద్రరావు 2005 తర్వాత సొంతంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొవిడ్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగంపై 2016లో యూఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.