YSRCP Leaders Attack on Minority Woman : తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ మంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైఎస్సార్సీపీ కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్‌బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YCP Leader attack an old Woman With Sandal : ప్రస్తుతం తమ కుటుంబం సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు వహీదా ఆరోపించారు. మక్బూల్ అహమ్మద్ బంధువుపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ ఆ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 మంది వైఎస్సార్సీపీ నేతలు తమ ఇంటి వద్దకు వచ్చి తమతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని తెలిపారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో భయాందోళనకు గురైన తన భర్త ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని అంటున్నారని పేర్కొన్నారు.
అదే సమయంలో మక్బూల్‌కు అనుకూలంగా మాట్లాడాలని బలవంతంగా మాట్లాడించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయించారని మహిళ వాపోయారు. వైఎస్సార్సీపీ నాయకుల వేధింపులు భరించలేక ఇంటికి దూరంగా ఉన్నానంటూ ఆమె వాపోయారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, చర్యలు తీసుకోని పక్షంలో తాను కలెక్టర్‌ను కలిసి తన బాధను వినిపించుకుంటానని అన్నారు. ఇలాగే బెదింరిపులు కొనసాగితే పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది : తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైఎస్సార్సీపీ కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్‌బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితురాలి వివరాల మేరకు వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పదిమంది మహిళలను పార్టీ కార్యాలయానికి తీసుకురావాలని స్థానిక నాయకుడు పట్టణానికి చెందిన వహీదాకు సూచించాడు. ఆమె తమ ప్రాంతానికి చెందిన 15 మందిని తీసుకెళ్లారు.
పది మందిని తీసుకురమ్మంటే ఎక్కువమందిని ఎందుకు పిలుచుకొచ్చావంటూ వృద్ధురాలిపై షామీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడాడు. డబ్బులు ఇస్తారన్న ఆశతో అంతమంది వచ్చారని, తల్లి వయస్సున్న తనను రంజాన్ మాసంలో బూతులు తిడతావా అంటూ ఆమె నిలదీశారు. దీంతో మరింత ఆగ్రహించిన షామీర్ వృద్ధురాలిపై చెప్పుతో దాడి చేశాడు. కార్యాలయంలో ఉన్న మహిళలు సర్దిచెబుతున్నా వినిపించుకోలేదు. బాధ్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తనకు మరణమే శరణ్యమంటూ బాధితురాలు రోదించారు.