Vyasaraya Math Lands Kabza: కర్ణాటకలోని మైసూరుకు సమీపంలోని సొసాలే కేంద్రంగా ఉన్న వ్యాసరాయ మఠానికి అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెలోని సర్వే నంబరు 1లో 727.43 ఎకరాల భూమి ఉంది. 1బి రిజిస్టర్‌లో వ్యాసరాయ మఠం భూమి అని, దీనికి ఖాతా నంబరు 1017 కేటాయించారు. ఇది కర్ణాటకకు చెందిన మఠం అయినప్పటికీ ఏపీ దేవదాయ చట్టం 1987 ప్రకారం దీనిని దేవదాయశాఖ పరిధిలోకి వచ్చే మఠంగా గుర్తించారు.
1997లో ఈ భూమంతా ఆ మఠానికి చెందినదంటూ అప్పటి తహసీల్దార్ పట్టా జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తితో భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2013లో చిత్తూరు కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. 2016లో రాష్ట్రవ్యాప్తంగా దేవదాయశాఖకు చెందిన ఆలయాలు, సత్రాలు, మఠాలు, దేవాదాయ సంస్థల భూములు గుర్తించి, వాటిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. వ్యాసరాయ మఠానికి చెందిన 727.43 ఎకరాలూ ఆ జాబితాలోకి ఎక్కాయి.
ఎసైన్డ్ భూములు కొల్లగొట్టి - కోట్లకు పడగలెత్తి - assigned lands purchase
ఈ భూముల్లో చాలాకాలంగా కొందరు సాగు చేస్తున్నారు. కొందరు గతంలో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందారు. కొందరు రైతులు ఈ భూములను ఇతరులకు విక్రయించారు. కర్ణాటకలోని మఠాధిపతి తమకు జీపీఏ ఇచ్చారంటూ పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నేత, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన మరొకరు ఈ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన ఓ నేత ఈ భూములన్నీ తనవేనంటూ హడావుడి చేస్తున్నారు.
స్థానికంగా మధ్యవర్తులను పెట్టుకొని ఆ భూములు సాగు చేసుకుంటున్నవారికి కొంత మొత్తం ఇచ్చి, తన ఆధీనంలోకి తీసుకునేందుకు చూస్తున్నారు. ఈ భూములకు సంబంధించి మఠాధిపతి ఇచ్చిన జీపీఏలన్నింటినీ రద్దు చేస్తూ 2012 మే 31న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఆయా వ్యక్తులు జీపీఏ ఉందంటూ దందాలు చేస్తున్నారు. ఈ భూముల టైటిల్ విషయంలో హైకోర్టులోనూ, మదనపల్లె కోర్టులోనూ కేసులు కొనసాగుతున్నాయి.
వైసీపీ నేత అర్జీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ గతేడాది ఓ కమిటీని వేసింది. ప్రాంతీయ సంయుక్త కమిషనర్, దేవాదాయ భూ పరిరక్షణ డిప్యూటీ కలెక్టర్, రాయలసీమ జిల్లాల ఉప కమిషనర్, అన్నమయ్య జిల్లా దేవాదాయశాఖ అధికారులతో కూడిన కమిటీ దీనిపై నివేదిక ఇవ్వాలని కోరింది. వీరిలో రాయలసీమ జిల్లాల ఉప కమిషనర్ మాత్రం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది.
మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్డీఏ నేతలు - NDA Leaders on Liquor Ban IN AP
ఆయన చాలాకాలం అధికార పార్టీ కీలక నేతల సహకారంతో ఇన్‌ఛార్జ్ హోదాలో ఆ పదవిలో కొనసాగారు. మిగిలిన అధికారులు మాత్రం అన్ని ప్రభుత్వ రికార్డుల్లో ఇవి మఠం భూములని స్పష్టంగా ఉన్నాయంటూ నివేదిక ఇచ్చారు. దేవాదాయశాఖ న్యాయ సలహాదారు ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం సరైనదేనని, దీని ప్రధాన మఠం ఎక్కడున్నా, ఆ భూములు దేవదాయశాఖ కిందే ఉంటాయని స్పష్టం చేశారు. చివరకు అడ్వకేట్ జనరల్ ఈ భూముల కేసులు కోర్టుల్లో ఉన్నందున వాటి తీర్పులు వచ్చేవరకు నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే దేవాదాయ ట్రైబ్యునల్‌లో విచారణ తప్పనిసరని చెప్పారు. ఇదంతా జరిగి ఏడెనిమిది నెలలయింది.
ఈ భూముల దస్త్రం ఇప్పుడు మళ్లీ కదులుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, ఫలితాలు వెలువడే నాటికి దీనిని కొలిక్కి తీసుకురావాలంటూ ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. అందుకే దేవదాయశాఖ కీలక అధికారి ఈ భూములపై ఈ నెల 16న సచివాలయంలో సమీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ భూముల రికార్డులు, ఇతర వివరాలన్నీ ఈ నెల 14లోపు దేవాదాయ కమిషనరేట్‌కు పంపాలంటూ అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ స్థాయి దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.
కొంతకాలంగా ఈ భూములపై 'పెద్దాయన' కన్నుపడినట్లు తెలిసింది. ఎలాగైనా 727.43 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పావులు కదపటం మొదలుపెట్టారు. జీపీఏ ఉందని చెప్పే పెద్దతిప్పసముద్రం మండలంలోని వైసీపీ నేత పేరిట ప్రభుత్వానికి గతంలో అర్జీ పెట్టించారు. ఈ భూములకు చెందిన మఠం కర్ణాటకలో ఉందని, ఇక్కడి దేవాదాయశాఖకు దీనితో సంబంధం లేదని, అవేమీ పట్టించుకోకుండా నిషేధిత జాబితాలో పెట్టారని అందులో పేర్కొన్నారు. వెంటనే నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తొలగించాలని కోరారు. తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ ఈ అర్జీపై ఆ 'పెద్దాయన' ద్వారా దేవాదాయశాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
విద్వేషాలు రెచ్చగొట్టు, సానుభూతి పట్టు - ముఖ్యమంత్రి జగన్ మొసలి కన్నీరు ! - YCP Sympathy Politics