Kollam Gangireddy Released: వైఎస్సార్సీపీ నేత, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాత్రంతా విచారించి ఇవాళ ఉదయం పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన కొల్లం గంగిరెడ్డి ఓ థియేటర్ స్థల వివాదంలో నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న రైల్వే కోడూరు పోలీసులు రాత్రి మదనపల్లికి తీసుకెళ్లారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో రాత్రంతా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారించారు. స్థల వివాదాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈ కేసులో ఎప్పుడు పిలిచినా విచారణకు రావాల్సి ఉంటుందని గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం విచారణ పూర్తవడంతో మదనపల్లి నుంచి గంగిరెడ్డి తిరుపతికి వెళ్లిపోయారు. తొలుత స్థల వివాదం కేసులో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. గతంలో భారీగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించారనే అభియోగాలు గంగిరెడ్డిపై ఉన్నాయి.
పోలీసుల అదుపులోకి వైఎస్‌ఆర్‌సీపీ నేత కొల్లం గంగిరెడ్డి - Kollam Gangireddy in Police Custody
కొంతకాలంగా స్థల వివాదం: స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రైల్వేకోడూరులోని లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ యజమానులకు గంగిరెడ్డికి మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఆదివారం సాయంత్రం లక్ష్మిప్యారడైజ్ థియేటర్ వద్ద ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు పగలగొట్టి గొడవ పడ్డారు. వీరందరూ కొల్లం గంగిరెడ్డి అనుచరులేనని థియేటర్ యజమానులు రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం గంగిరెడ్డిని విచారణ కోసం తిరుపతి నుంచి పిలిపించారు.
దాదాపు గంట పాటు పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంగిరెడ్డిని రెండు వాహనాల్లో ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లి దస్త్రాల దహనం కేసు దర్యాప్తులో భాగంగా అక్కడికి వెళ్లడంతో, కొల్లం గంగిరెడ్డిని కూడా అక్కడికే తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. రైల్వే కోడూరు పోలీసులు కొల్లం గంగిరెడ్డిని రాత్రి 10 గంటల సమయంలో మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఎస్పీ అతడిని విచారించారు.
గతంలోనూ ఎన్నో అభియోగాలు: గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబుపై బాంబుదాడి జరిగిన కేసులో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. తదనంతరం ఎర్రచందనాన్ని 2004 నుంచి 2014 వరకు పెద్దఎత్తున విదేశాలకు తరలించినట్లు గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.
ఆ కేసులో దేశం విడిచి పారిపోయి మారిషస్‌లో ఉన్న కొల్లం గంగిరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. కడప జైల్లో ఉన్న కొల్లం గంగిరెడ్డి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న గంగిరెడ్డి కడప, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో భూధందాలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొల్లం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని, నేడు విడిచిపెట్టారు.
నేరాలు చేయటం-విదేశాలకు చెక్కేయటం - ఇలాంటి వారిని తీసుకురాలేమా! - accused persons go to abroad